The Paradise

The Paradise: కోర్టును ఆశ్రయించిన ‘ది ప్యారడైజ్’ నిర్మాతలు.. రిలీజ్ ముందే ఎందుకు..?

The Paradise: నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన భారీ పాన్-ఇండియా సినిమా ‘ది ప్యారడైజ్’ సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. అయితే విడుదల కి ముందు సినిమా ప్రతిష్టను, కలెక్షన్లను దెబ్బతీసే ఉద్దేశంతో సామాజిక మాధ్యమాల్లో ఉద్దేశపూర్వక దుష్ప్రచారం జరుగుతోందంటూ సినిమా నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బెంగళూరు అదనపు నగర సివిల్ అండ్ సెషన్స్ కోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన న్యాయస్థానం.. సెప్టెంబర్ 19న పలు వివాదాస్పద సోషల్ మీడియా ఖాతాలు, పరువు నష్టం కలిగించే లింకులపై తాత్కాలిక నిలుపుదల ఉత్తర్వులు జారీ చేసింది.

భారీ పెట్టుబడులు – వ్యాపారాన్ని దెబ్బతీసే కుట్ర..

సాధారణ సినిమా సమీక్షలు, విమర్శల పరిధిని దాటి.. కావాలనే సినిమా వ్యాపారాన్ని, ప్రతిష్టను దెబ్బకొట్టే లక్ష్యంతో కొన్ని ప్రొఫైల్స్, యూఆర్ఎల్‌లు (URLs), కామెంట్లు పనిచేస్తున్నాయని నిర్మాతలు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
సినిమా నిర్మాణం, విస్తృత ప్రచారం, థియేట్రికల్ పంపిణీ కోసం కోట్ల రూపాయల భారీ పెట్టుబడులు పెట్టామని, సరిగ్గా విడుదల ముంగిట ఇలాంటి నెగెటివ్ కంటెంట్ సర్క్యులేట్ అయితే తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లుతుందని వాదించారు.
ముందస్తు నోటీసులు లేకుండా ఆదేశాలు..
నిందితులకు ముందస్తు నోటీసులు జారీ చేస్తే వారు కంటెంట్‌ను డిలీట్ చేసి ఇతర ఖాతాల ద్వారా మరింత విస్తృతంగా వ్యాప్తి చేసే ప్రమాదం ఉందని వివరించారు. నిర్మాతలు సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు.. సదరు కంటెంట్ ఆర్థిక నష్టం కలిగించేలా ఉందని ప్రాథమికంగా నిర్ధారించింది.

కేవలం నిర్దిష్ట యూఆర్ఎల్‌లపైనే నిషేధం – రివ్యూలకు అభ్యంతరం లేదు..

ఈ తాత్కాలిక నిషేధాజ్ఞలు కేవలం పిటిషన్‌లో స్పష్టంగా పేర్కొన్న పరువు నష్టం కలిగించే కొన్ని నిర్దిష్ట పోస్టులు, ఖాతాలు మరియు యూఆర్ఎల్‌లకు మాత్రమే వర్తిస్తాయని కోర్టు స్పష్టం చేసింది.చిత్రం విడుదలైన తర్వాత ప్రేక్షకులు లేదా సినీ విమర్శకులు ఇచ్చే సాధారణ, వాస్తవిక సమీక్షలపై (Reviews) ఎలాంటి ఆంక్షలు లేవని న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రతివాదులకు సమన్లు జారీ చేసిన అనంతరం తదుపరి విచారణను అక్టోబర్ 28వ తేదీకి వాయిదా వేసింది. కీలకమైన ప్రమోషన్ల సమయంలో కోర్టు నుంచి లభించిన ఈ తాత్కాలిక ఊరట నిర్మాతలకు రిలీఫ్‌ను ఇచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *