Nagarjuna: ఎందరో పరభాషలవారు తెలుగు చిత్రాలతోనే వెలుగు చూశారు. చెన్నైలో జన్మించిన సినిమాటోగ్రాఫర్ శివకుమార్ జయకుమార్ తెలుగులో అనేక చిత్రాలకు శివ పేరుతోనే పనిచేశారు. అసలు ఆయనలో ఓ దర్శకుడు ఉన్నారని తొలుత గుర్తించింది కింగ్ నాగార్జున అట! నాగ్ హీరోగా రూపొందిన ‘నేనున్నాను’కు శివ సినిమాటోగ్రాఫర్. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే శివ పనితనం చూసిన నాగార్జున, నీలో ఓ డైరెక్టర్ ఉన్నాడని, సబ్జెక్ట్ రెడీ చేసుకోమని ప్రోత్సహించారట!. దాంతో నాగ్ ను దృష్టిలో పెట్టుకొనే శివ తన ‘శౌర్యం’ కథను తయారు చేసుకున్నారు.
ఇది కూడా చదవండి: Samantha: ప్రేమ ఉంటే ప్రతిరోజూ పండగే..
Nagarjuna: అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. తరువాత గోపీచంద్ హీరోగా ‘శౌర్యం’ తెరకెక్కించి దర్శకునిగానూ సక్సెస్ సాధించారు శివ. తరువాత ‘శంఖం’ కూడా రూపొందించి విజయం చూశాక తమిళబాట పట్టారు శివ. తెలుగులో ఘనవిజయం సాధించిన రాజమౌళి ‘విక్రమార్కుడు’ రీమేక్ గా ‘సిరుతై’తో తమిళ చిత్రసీమలో అడుగుపెట్టారు శివ. ఆ తరువాత అజిత్ తో వరుసగా “వీరమ్, వేదాళమ్, వివేగమ్, విశ్వాసం”తో తనదైన బాణీ పలికించిన శివ, రజనీకాంత్ తో ‘అన్నాతై’ రూపొందించారు. ఇప్పుడు సూర్య హీరోగా అత్యంత భారీ స్థాయిలో ‘కంగువ’ చిత్రాన్ని తెరకెక్కించారు. నవంబర్ 14న ‘కంగువ’ విడుదల కానుంది. ఈ సినిమా ప్రచారంలోనే తాను డైరెక్టర్ కావడానికి స్ఫూర్తి నింపిన నాగార్జునను గుర్తు చేసుకున్నారు శివ.