Suryapet: సూర్యాపేట జిల్లాలో రౌడీలు రెచ్చిపోయారు. మారణాయుధాలు చేతబట్టుకొని శత్రువులను హతమార్చేందుకు రెచ్చిపోయారు. బైక్‌పై వెళ్తున్న ముగ్గురిని కారులో వచ్చిన దుండగులు చంపేందుకు వెంటపడగా, బాధితులు జనసంచారం ఉన్న దుకాణంలోకి వెళ్లగా, మారణాయుధాలను అక్కడే పడేసి కారులో ఎక్కి పరారయ్యారు. ఈ ఘటనతో సూర్యాపేట పట్టణం ఉలికిపాటుకు గురైంది. ఈ ఘటన భద్రతా చర్యలను ప్రశ్నార్థకం చేస్తున్నది.
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఖమ్మం క్రాస్‌రోడ్ నుంచి ఓ వ్యక్తి బైక్‌ను నడుపుతుండగా, ఇద్దరు మహిళలు వెనుక కూర్చొని ఉన్నారు. ఆ ముగ్గురిని వెనుక నుంచి కారులో వచ్చిన వారు వెంబడించారు. బీబీగూడెం సమీపంలో ఉన్న ఓ వైన్స్ ముందుకు రాగానే కారులో నుంచి మారణాయుధాలతో బయటకు వచ్చిన ఆ వ్యక్తులు బైక్‌పై వచ్చే వారిని హతమార్చేందుకు వెనుక నుంచి పరుగున వచ్చారు.
దీనిని గమనించిన బైక్ వ్యక్తి, ఆ ఇద్దరు మహిళలు వాహనాన్ని అక్కడే పడేసి వైన్‌షాపులోనికి పరుగెత్తారు. అక్కడే ఉన్న పలువురు ఏం జరుగుతుందోనని బయటకు రావడంతో కారులో వచ్చిన వ్యక్తులు మళ్లీ అదే కారులో ఎక్కి పారిపోయారు. ఈ ఘటన వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉన్నది.