Richest Ganpati: వినాయక చవితి వేడుకలకు దేశమంతా సిద్ధమవుతోంది. వినాయకుడి విగ్రహాలు, మండపాలు అలంకరణలతో సందడిగా మారాయి. ఈ సందడిలో ముంబైలోని జీఎస్బీ సేవా మండల్ గణపతి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దేశంలోనే అత్యంత సంపన్న గణపతిగా పేరుగాంచిన ఈ వినాయకుడికి ఈసారి రికార్డు స్థాయిలో ఏకంగా 474 కోట్లకు పైగా బీమా చేయించారు.
గత కొన్నేళ్లుగా జీఎస్బీ గణపతి బీమా విషయంలో రికార్డులు సృష్టిస్తోంది. గత సంవత్సరం 400 కోట్లకు పైగా బీమా చేయించగా, 2023లో 360 కోట్లకు పైగా బీమా తీసుకున్నారు. ఈసారి ఆ మొత్తం మరింత పెరిగి 474 కోట్లకు చేరింది.
ఎందుకంత బీమా?
ఈ బీమా కేవలం గణపతి విగ్రహానికి మాత్రమే కాదు. దానికి సంబంధించిన అనేక విషయాలను ఇది కవర్ చేస్తుంది. జీఎస్బీ సేవా మండల్ అధ్యక్షుడు అమిత్ పాయ్ తెలిపిన వివరాల ప్రకారం:
ఆభరణాల బీమా: గణపతికి అలంకరించే సుమారు 67 కోట్ల రూపాయల విలువైన బంగారు, వెండి ఆభరణాలకు బీమా చేయించారు. ఇందులో 325 కిలోల వెండి కూడా ఉంది.
వ్యక్తిగత బీమా: మండపంలో పనిచేసే వాలంటీర్లు, పూజారులు, వంటవారు, సెక్యూరిటీ గార్డులు, ఇతర సిబ్బందితో పాటు, దర్శనానికి వచ్చే భక్తులకు కూడా భద్రత కల్పించేందుకు 375 కోట్ల రూపాయల వ్యక్తిగత బీమా పాలసీ తీసుకున్నారు.
విపత్తుల బీమా: అగ్ని ప్రమాదాలు, భూకంపాల వంటి ప్రకృతి విపత్తుల వల్ల జరిగే నష్టాలను నివారించడానికి 2 కోట్ల రూపాయల బీమాను ప్రత్యేకంగా తీసుకున్నారు.
పబ్లిక్ లయబిలిటీ బీమా: భక్తుల భద్రత, వారికి ఏవైనా ఇబ్బందులు తలెత్తకుండా 30 కోట్ల రూపాయల బీమాను కల్పించారు.
జీఎస్బీ మండపంలో ప్రతి రోజు సుమారు 20,000 మంది భక్తులు గణపతిని దర్శించుకోవడానికి వస్తారని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ భారీ సంఖ్యలో భక్తులు వస్తుండటంతో భద్రత, రక్షణ విషయంలో వీరు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ గణపతి మండపం, దాని బీమా వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

