diwali news

Diwali Movies: బాక్సాఫీస్ వద్ద దీపావళి సినిమాల సందడి

Diwali Movies: అక్టోబర్ నెలలో రెండు పెద్ద పండగలు బ్యాక్ టు బ్యాక్ పలకరించాయి. అందులో ఒకటి దసరా కాగా మరొకటి దీపావళి. అందుకేనేమో డబ్బింగ్ తో కలిపి ఈ నెల ముప్పైకి పైగా సినిమాలు జనం ముందుకు వచ్చాయి. మరి దసరా బరిలో ధమాకా సృష్టించిన చిత్రమేదో.. దీపావళికి  వెలుగులు విరజిమ్మిన సినిమాలేవో చూసేద్దాం.

అక్టోబర్ చివరి రోజు వచ్చిన  పెద్ద పండగ దీపావళి. ఈ ఫెస్టివల్ కు రెండు స్ట్రయిట్ సినిమాలు, రెండు డబ్బింగ్ మూవీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. విశేషం ఏమంటే… కన్నడ అనువాద చిత్రం ‘బఘీర’ తప్ప మిగిలిన వన్నీ పాజిటివ్ టాక్ నే తెచ్చుకున్నాయి.

‘కేజీఎఫ్’ సీరిస్ లోని రెండు సినిమాల తర్వాత కన్నడ నుండి కొన్ని సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యాయి కానీ ఆ స్థాయి విజయాలను అందుకోలేకపోయాయి. ఇక కన్నడలోనే తొలుత విడుదలైన ‘కాంతర’ ఆ తర్వాత వివిధ భాషల్లోకి డబ్ అయ్యి ఘన విజయాన్ని నమోదు  చేసుకోవడమే కాదు… రిషబ్ శెట్టికి జాతీయ ఉత్తమ నటుడు అవార్డునూ తెచ్చింది. ఇక ఈ నేపథ్యంలో ఇదే నెలలో వచ్చిన ‘మార్టిన్’ నిరాశ పర్చగా, అదే బాటలో సాగింది ‘బఘీర’ సినిమా. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే బ్యానర్ నుండి వచ్చిన ఈ సినిమాకు కథను ప్రశాంత్ నీల్ సమకూర్చాడు. శ్రీమురళీ హీరోగా నటించాడు. కానీ రొట్టకొట్టుడు స్టోరీ, స్క్రీన్ ప్లే కారణంగా దీపావళికి బరిలో దిగిన ‘బఘీర’ తుస్సుమంది. అయితే ఇదే సమయంలో తమిళ అనువాద చిత్రం ‘అమరన్’ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

జమ్ము కశ్మీర్ లో ఉగ్రవాదులను ఏరివేసే క్రమంలో మేజర్ ముకుంద్ వరద రాజన్  వీరమరణం పొందాడు. 2014లో ఆయన మరణానంతరం భారత ప్రభుత్వం అశోక చక్ర పురస్కారాన్ని ప్రకటించింది. సోనీ పిక్చర్స్ సంస్థలో కలిసి కమల్ హాసన్ ఆయన కథను ‘అమరన్’ పేరుతో సినిమాగా నిర్మించాడు. శివ కార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన ఈ సినిమాను దీపావళి కానుకగా విడుదల చేశారు. ఈ మూవీ ప్రీమియర్ షోకు హాజరైన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చిత్ర బృందాన్ని ప్రశంసించాడు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన తమిళ వీరుల కథలు సినిమాగా తీసుకురావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వరద రాజన్ త్యాగాన్నే కాకుండా అతని ప్రేమ కథను దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి ఆసక్తికరంగా చూపించడంతో ‘అమరన్’ హిట్ టాక్ తెచ్చుకుంది.

ALSO READ  చౌకబారు విమర్శలు మానుకోండి.. కేటీఆర్ కు మంత్రి దామోదర హెచ్చరిక!

దీపావళి కానుకగా వచ్చిన ‘క’ సినిమా సైతం అనేవి విషయాలలో సమ్ థింగ్ స్పెషల్ గా నిలిచింది. ‘రాజావారూ రాణి గారు’ సినిమాతో హీరోగా పరిచయం అయిన కిరణ్ అబ్బవరంకు ఇది తొమ్మిదో సినిమా. అయితే అతని కెరీర్ లో చాలా వరకూ పరాజయాలే ఉన్నాయి. బట్… కిరణ్ మాత్రం తాను నటించిన నాలుగు సినిమాలు డీసెంట్ హిట్ ను అందుకున్నాయని తెలిపాడు. అలానే ‘క’ లాంటి సినిమా గతంలో వచ్చిందని ఎవరైనా అంటే… యాక్టింగ్ మానేస్తాననీ శపథం చేశాడు. అయితే… అలాంటి అవకాశం అతనికి విమర్శకులు తీసుకురాలేదు. ‘క’ లాంటి కథ, క్లయిమాక్స్ ఉన్న సినిమా రాలేదని చెప్పడం… ఓ రకంగా కిరణ్ అబ్బవరంకు ఊరటనిచ్చింది.

కథ పరంగా ‘క’ కొత్తదే అయినా… దానిని తెరకెక్కించిన విధానం అంత గొప్పగా లేదనే విమర్శలు వచ్చాయి. క్లయిమాక్స్ అద్భుతం అంటూనే… అంతవరకూ జనం ఓపికగా కూర్చోవాలి కదా! అనే మాటలూ వినిపించాయి. ఏదేమైనా ‘క’కు లభించిన ఆదరణ మాత్రం టీమ్ ను ఆనంద పర్చింది. దాంతో విడుదల రోజునే వారు సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసుకున్నారు. నిజంగా ఈ సినిమాకు మంచి ఆదరణే లభిస్తే… అనివార్య కారణాలతో ఆపేసిన అదర్ లాంగ్వేజెస్ వర్షన్స్ ను వీలైనంత త్వరగా వీరు విడుదల చేయొచ్చు. మొదటి రోజున తమ చిత్రం రూ. 6.18 కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేసింది నిర్మాత గోపాలకృష్ణా రెడ్డి తెలిపారు. ఈ సినిమాతో సుజీత్, సందీప్ దర్శకులుగా పరిచయం అయ్యారు.

దీపావళికి వచ్చిన సినిమాలు దాదాపుగా అన్నీ కూడా పీరియాడికల్ మూవీసే. ‘అమరన్’ 2014కు ముందు కథ కాగా ‘క’ 1970లలో జరిగే కథ. ఇక దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ 1980 నాటి కథ. బ్యాంకింగ్ వ్యవస్థలోని లోటు పాట్లను, షేర్ మార్కెట్ లోని లొసుగులను తెలియచేస్తూ వెంకీ అట్లూరి ఈ కథను రాసుకున్నారు. సాయి సౌజన్యతో కలిసి సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే స్ట్రయిట్ తెలుగు సినిమాలు ‘మహానటి, సీతారామం’తో సక్సెస్ ను అందుకున్న దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’తో హ్యాట్రిక్ సాధించినట్టే అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.

షేర్ మార్కెట్ పీక్స్ లో ఉన్న టైమ్ లో హర్షద్ మెహతా కుంభకోణం దేశాన్ని ఓ ఊపు ఊపేసింది. ఈ సంఘటన ఆధారంగా హిందీలో వెబ్ సీరిస్ వచ్చింది కానీ తెలుగులో ఇలాంటి కథాంశంతో ఎలాంటి సినిమా రాలేదు. అయితే బ్యాంకింగ్ వ్యవస్థ, షేర్ మార్కెట్ గురించి కాస్తో కూస్తో తెలిసివారు కనెక్ట్ అయినట్టుగా సాధారణ ప్రేక్షకులు ఈ మూవీతో కనెక్ట్ కావడం కష్టమే అనే విమర్శలూ వినిపిస్తున్నాయి. అయితే… మేకింగ్ క్వాలిటీ పరంగానూ, నటీనటుల యాక్టింగ్ పరంగానూ ‘లక్కీ భాస్కర్’ సక్సెస్ ట్రాక్ ఎక్కడం గ్యారంటీ అంటున్నారు నిర్మాత నాగవంశీ. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన ఫస్ట్ డే ఓపెనింగ్స్ పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. తమ చిత్రం రూ. 12. 7 కోట్ల గ్రాస్ వసులూ చేసిందని చెప్పారు.

ALSO READ  Ramayana: రెండు పార్టులుగా రామాయణ.. రిలీజ్ డేట్స్ ఫిక్స్

మొత్తం మీద అక్టోబర్ లో విడుదలైన 31 చిత్రాలలో… అనువాద చిత్రాలు సైతం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. స్ట్రయిట్ సినిమాలు కూడా తీవ్ర నిరాశకు గురిచేశాయి. అటువంటి సమయంలో దీపావళికి వచ్చిన మూడు సినిమాలు ఆశాజనకమైన ఫలితాలను అందుకుని… బాక్సాఫీస్ బరిలో వెలుగులు నింపడం విశేషం.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *