Virat Kohli: వరుసగా టెస్టుల్లో విఫలమౌతున్న విరాట్ కోహ్లీపై నెట్టింట్లో దుమ్మెత్తిపోస్తున్నారు. నీలాంటి ప్లేయర్..పరుగుల దిగ్గజం జట్టులో ఉండి ఏం ఉపయోగం అంటూ ఫ్యాన్స్ కోహ్లీపై భగ్గుమంటున్నారు. న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడో టెస్టు చివరి ఓవర్లలో రనౌట్ కావడంతో కోహ్లీపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.
టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లీపై ఫ్యాన్స్ తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. టెస్టుల్లో విరాట్ కోహ్లి వైఫల్యాల పరంపర కొనసాగుతుండడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముంబైలో జరుగుతున్న మూడోటెస్టులోనూ కోహ్లీ మరోసారి అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. రనౌట్ అయి వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో ఫ్యాన్స్ సైతం కోహ్లి తీరును విమర్శిస్తున్నారు. నీలాంటి దిగ్గజ ఆటగాడు కూడా ఇలా చేస్తే.. జట్టుకు నీతో ఏం ఉపయోగం?అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Virat Kohli: స్వదేశంలో బంగ్లాదేశ్‌తో సిరీస్ సందర్భంగా టెస్టులకు తిరిగి వచ్చిన కోహ్లి.. రెండు టెస్టుల్లో నాలుగు ఇన్నింగ్స్‌లో వరుసగా 6, 17, 47, 29(నాటౌట్) పరుగులు మాత్రమే స్కోరు చేశాడు. బంగ్లాదేశ్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించలేకపోయినా. ఈ సిరీస్‌లో భారత్ గెలవడంతో కోహ్లీ వైఫల్యాలపై పెద్దగా చర్చ జరగలేదు. కానీ కివీస్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ లో వరుసగా రెండు టెస్టుల్లో పరాజయంతో కోహ్లీ వైఫల్యాలపై పెద్ద చర్చ నడుస్తోంది. . బెంగళూరులో తొలి మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో డకౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్ లో 70 పరుగులతో ఫామ్‌లోకి వచ్చాడనుకునేలోపు.. పుణెలో జరిగిన రెండో టెస్టులో మళ్లీ ఫెయిల్ అయ్యాడు. ఆ మ్యాచ్‌లో కోహ్లి సాధించిన స్కోర్లు 1, 17. ఇక ఈ రెండు టెస్టుల్లో టీమిండియా ఓటమిపాలై.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 0-2తో కోల్పోవడంతో కోహ్లీ టార్గెట్ గా విమర్శల వర్షం మొదైలైంది.
ఇది కూడా చదవండి: IPL 2025: ఆర్సీబీ కెప్టెన్ గా మళ్లీ విరాట్ కోహ్లీ..?
Virat Kohli: చివరి టెస్టుతోనైనా ఫాం అందుకుంటాడని.. ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో ఇరగదీస్తాడని అనుకున్న సమయంలో మళ్లీ కోహ్లీ తుస్సుమనిపించాడు. ముంబైలోని వాంఖడే లో జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో బౌలర్ల విజృంభణతో 235 పరుగులకే కివీస్ పరిమితమైంది. ఆట ఆఖరులో తొలి రోజే బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియాకు ఆది నుంచే ఎదురుదెబ్బలు తగిలాయి. కెప్టెన్ రోహిత్ శర్మ 18 పరుగులు చేసి ఔట్ కాగా.. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 30 పరుగులు చేసి మంచి ఆరంభాన్ని వేస్ట్ చేసుకున్నాడు. చివరి ఓవర్లు కావడంతో నైట్ వాచ్ మన్ గా వచ్చిన మహ్మద్ సిరాజ్ డకౌట్ గా వెనుదిరగడంతో వరుసగా రెండు వికెట్లు నష్టపోయింది.
ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చి జాగ్రత్తగా ఆడాల్సిన కోహ్లి ఊహించని రీతిలో రనౌట్ అయ్యాడు. భారత ఇన్నింగ్స్ పందొమ్మిదవ ఓవర్‌లో రచిన్ రవీంద్ర వేసిన మూడో బంతిని షాట్ ఆడిన కోహ్లి.. సింగిల్ కోసం గిల్‌ను పిలిచాడు. ఇద్దరూ క్రీజును వీడిన సమయంలో.. బంతిని అందుకున్న ఫీల్డర్ మ్యాట్ హెన్రీ కోహ్లి వస్తున్న నాన్ స్ట్రైకర్ ఎండ్ వికెట్ల వైపు బాల్ త్రో చేశాడు. నేరుగా అది వికెట్లను గిరాటేయడంతో కోహ్లి రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. అప్పటికి కోహ్లి డైవ్ చేసినా ఫలితం లేకపోయింది. కేవలం నాలుగు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లి అవుట్ కాగా టీమిండియా కష్టాల్లో పడింది. అసలు అప్పుడు ఆ సింగిల్ అవసరమే లేదు. వికెట్ ముఖ్యమైన సందర్భంలో సింగిల్ కోసం వికెట్ త్యాగం చేసిన కోహ్లీపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.