Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేడు (ఏప్రిల్ 20, 2026) తన 76వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నారా రోహిత్, జూనియర్ ఎన్టీఆర్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వేదికగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
‘మావయ్య గారు’ అంటూ ఎన్టీఆర్ భావోద్వేగ పోస్ట్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా చంద్రబాబుకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. “చంద్రబాబు నాయుడు మావయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు” అంటూ ఆయన పెట్టిన పోస్ట్ అభిమానులను ఆకట్టుకుంటోంది. మీరు నిండైన ఆరోగ్యం, సంతోషంతో ప్రజాసేవలో మీ దార్శనికతను కొనసాగించాలని ఆశిస్తున్నట్లు తారక్ పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ఆత్మగౌరవం చంద్రబాబు నాయకత్వంలో మరింత వృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య దూరం పెరిగిందని వస్తున్న వార్తల నేపథ్యంలో, ‘మావయ్య’ అంటూ ఎన్టీఆర్ సంబోధించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
విజనరీ లీడర్కు పవన్ కల్యాణ్ విషెస్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపారు. చంద్రబాబు నాయుడి సుదీర్ఘ రాజకీయ అనుభవం, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే ఆయన ‘విజన్’ గురించి పవన్ కొనియాడారు. రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం వంటి లక్ష్యాలతో ముందుకు సాగుతున్న ఆయన పాలనలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఆయన కృషి అభినందనీయమని పవన్ పేర్కొన్నారు.
హ్యాపీ బర్త్ డే పెద్దనాన్న: నారా రోహిత్
నటుడు నారా రోహిత్ తన పెద్దనాన్న చంద్రబాబుకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఒక ఆశయం కోసం నిరంతరం శ్రమించే గొప్ప రాజనీతిజ్ఞుడు అంటూ ఆయనను ప్రశంసించారు. ప్రజలకు సేవ చేసేందుకు భగవంతుడు ఆయనకు మరిన్ని శక్తులు ప్రసాదించాలని కోరుకున్నారు.
ప్రస్తుతం చంద్రబాబు నాయుడు తన పుట్టినరోజు సందర్భంగా జాతీయ రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నారు. ఎన్డీఏ కూటమి తరపున పొరుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని తెలుగుదేశం శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
