Monalisa: కుంభమేళాలో పూసల అమ్మకంతో దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో గుర్తింపు పొందిన మోనాలిసా, ఇప్పుడు తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయం కానున్నారు. ఆమె నటిస్తున్న తొలి చిత్రానికి ‘లైఫ్’ అనే టైటిల్‌ను నిర్ణయించారు. సాయి చరణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంగమాంబ క్రియేషన్స్ నిర్మిస్తోంది. శ్రీను కోటపాటి దర్శకత్వం వహిస్తున్నారు.
‘లైఫ్’ సినిమా ప్రారంభోత్సవం బుధవారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి పూజ కార్యక్రమంతో చిత్రం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నటుడు సురేష్ క్లాప్ కొట్టగా, నిర్మాత డీఎస్ రావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. శివన్నారాయణ గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా నిర్మాత అంజయ్య మాట్లాడుతూ “ఇప్పుడే షూటింగ్ ప్రారంభించాం, త్వరలోనే రెగ్యులర్ షెడ్యూల్ కొనసాగుతుంది. కుంభమేళాలో చిన్న వ్యాపారం చేస్తూ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన అమ్మాయితో సినిమా చేస్తే మంచి ఆకర్షణ ఉంటుందనిపించింది. దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో మోనాలిసాను ఎంపిక చేశాం. ఈ కథ సాఫ్ట్వేర్ ఉద్యోగుల జీవితాలను ప్రతిబింబిస్తుంది. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ థాంక్స్” అన్నారు.
హీరో సాయి చరణ్ మాట్లాడుతూ “దర్శకుడిని కలిసిన రోజే ఈ పాత్రకు నేను సరిపోతానని చెప్పారు. యువతను ఆకట్టుకునే కథ. మంచి సందేశంతో కూడిన చిత్రం ఇది. అందరి మద్దతుకు ధన్యవాదాలు” అన్నారు.
హీరోయిన్ మోనాలిసా మాట్లాడుతూ “హైదరాబాద్ రావడం, తెలుగు సినిమా చేసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. తెలుగు ఇప్పుడు రాకపోయినా త్వరలో నేర్చుకుంటాను. ఈ సినిమా నా జీవితంలో పెద్ద అవకాశం” అని చెప్పారు.
దర్శకుడు శ్రీను కోటపాటి మాట్లాడుతూ “సాఫ్ట్వేర్ ఉద్యోగుల రోజువారీ జీవితం, ఒత్తిళ్లు, భావోద్వేగాలు ఈ కథలో ఉంటాయి. నగర జీవన పరుగు వెనుక మనసుకు జరిగే ప్రయాణాన్ని చూపిస్తున్నాం. మోనాలిసా పాత్ర సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది” అన్నారు. సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభమవుతుంది.

