Mohan Babu: ప్రముఖ నటుడు మంచు మోహన్‌బాబు పోలీసుల ముందుకొచ్చేందుకు జంకుతున్నారా? పరువు ప్రతిష్ఠ పోతుందని భయపడుతున్నారా? ఈ లోగా సర్దుకుంటుందేమోనని భావిస్తున్నారా? సర్దుబాటు కాకపోవడంతో మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లారా? అంటే అవుననే సమాచారం తెలుస్తున్నది. మంచు ఫ్యామిలీలో కుంపటి రాజుకుంటూనే ఉన్నది. వారింటిలో వివాదం సమసిపోకముందే పోలీస్ కేసు మోహన్‌బాబును వెంటాడుతున్నది.
Mohan Babu: జర్నలిస్టులపై దాడి విషయంలో మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఆ కేసులో అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది కోర్టును కోరారు. అయితే ఆకేసులో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని, కౌంటర్ దాఖలు తర్వాతే విచారణ జరిపి నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో అరెస్టు తప్పదేమోనన్న అనుమానంతో మళ్లీ మోహన్‌బాబు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని అనుమానం. మోహన్‌బాబు ప్రస్తుతం బెంగళూరులో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
Mohan Babu: మోహన్‌బాబు దాడిలో గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్టును స్వయంగా కలిసినా ఫలితం దక్కలేదని తెలుస్తున్నది. జర్నలిస్టుతోపాటు ఆయన కుటుంబ సభ్యులకు, మీడియా ప్రతినిధులకు మోహన్‌బాబు క్షమాపణలు చెప్పారు. కేసు కోర్టులో ఉండటంతో ఇప్పట్లో తేలేలా లేకుండాపోయింది. దీంతో ఎలాగైనా అరెస్టు తప్పదేమోనన్న అనుమానంతో ఆయన పోలీసులకు అందుబాటులో లేకుండా పోయారని భావిస్తున్నారు.