Mohammed Siraj: 14 ఏళ్ల టెస్ట్ కెరీర్ కు విరాట్ కోహ్లీ వీడ్కోలు పలికాడు. 2011లో తన కెరీర్ ప్రారంభమైనప్పటి నుండి కింగ్ కోహ్లీ చాలా మంది ఆటగాళ్లకు వెన్నెముకగా నిలిచాడు. వారిలో మహ్మద్ సిరాజ్ ఒకరు. సిరాజ్ ప్రస్తుతం విరాట్ కోహ్లీ రిటైర్మెంట్‌ను నమ్మే స్థితిలో లేడు. ఈ బాధతోనే అతను సోషల్ మీడియాలో కోహ్లీకి కృతజ్ఞతలు తెలుపుతూ బహిరంగ లేఖ రాశాడు.
నా సూపర్ హీరో… టెస్ట్ క్రికెట్‌లో మీ అద్భుతమైన కెరీర్‌కు అభినందనలు. మీ వారసత్వం శాశ్వతంగా ఉంటుంది. నాలాంటి క్రికెటర్ల తరంకు మీరు స్ఫూర్తినిచ్చారు. మీరు మీ విజయాలను కొనసాగిస్తారని, దానిని కొనసాగించాలని నేను ఆశిస్తున్నాను. నువ్వు లేకుండా డ్రెస్సింగ్ రూమ్ ను ఊహించుకోవడం కష్టంగా ఉంది. ఎల్లప్పుడూ నాకు మద్దతుగా నిలిచినందుకు, నన్ను ఇన్ స్పైర్ చేసినందుకు ధన్యవాదాలు. మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను’’ అని సిరాజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
సిరాజ్ కు అవకాశం:
2020లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో మహమ్మద్ సిరాజ్ భారత టెస్ట్ జట్టుకు అరంగేట్రం చేశాడు. అప్పటి నుండి సిరాజ్ టీం ఇండియాలో శాశ్వత సభ్యుడిగా ఎదిగాడు. ఇప్పటివరకు మొత్తం 36 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. ఈ సమయంలో అతను 67 ఇన్నింగ్స్‌లలో బౌలింగ్ చేసి మొత్తం 100 వికెట్లు పడగొట్టాడు.
2021లో లార్డ్స్‌లో భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ విరాట్ కోహ్లీ, మహమ్మద్ సిరాజ్‌లకు చిరస్మరణీయమైనది. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో అద్భుతమైన నాయకత్వాన్ని ప్రదర్శించిన కోహ్లీ.. సిరాజ్ నుంచి అద్భుత ప్రదర్శన రాబట్టాడు. ఈ మ్యాచ్‌లో సిరాజ్ మొత్తం 8 వికెట్లు పడగొట్టి టీమిండియా 151 పరుగుల తేడాతో విజయం సాధించడంలో కీ రోల్ పోషించాడు. దీనిని ఇప్పటికీ కింగ్ కోహ్లీ నాయకత్వంలో ఉద్భవించిన మియా మ్యాజిక్‌గా అభివర్ణిస్తారు.