Mohammed Shami

Mohammed Shami: షమీ.. కంప్లీట్ టీమ్ మ్యాన్

Mohammed Shami: ఇంటా? బయటా?…. పేసా? స్పిన్నా?.. కుడిచేతి వాటమా? ఎడమచేతి వాటమా?
టెస్టు సిరీసుల్లో ప్రతి మ్యాచ్ కీ ముందు సహజంగా టీమ్ మేనేజ్మెంట్ చేసే కసరత్తు ఇది. పిచ్ స్వభావాన్ని బట్టి ఏ ప్లేయర్ ను ఎంచుకోవాలో? ప్రత్యేకించి బౌలింగ్ విభాగంలో ఎవరెవరుండాలో నిర్ణయించునే ముందు ఎదురయ్యే డైలమా ఇది. అయితే, ఎలాంటి ఆలోచనా చేయకుండానే కచ్చితంగా ఎంచుకునే ఆటగాడొకడున్నాడు. అతనే మహ్మద్ షమీ. ఫిట్ గా ఉంటే చాలు ఈ బెంగాల్ స్పీడ్ స్టర్ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తాడు. ఏడాదిగా గాయంతో దూరమైన ఈ మేటి పేసర్ మధ్యప్రదేశ్ తో రంజీ మ్యాచ్లో చెలరేగాడు. 4 వికెట్లతో ఫిట్ నెస్ నిరూపించుకున్నాడు. అంతే… అతన్ని ఆస్ట్రేలియాలో జరిగే బోర్డర్-గవాస్కర్ సిరీస్ కు పంపాలని డిమాండ్ మొదలైంది. అసలు ఏముంది షమీలో? ఎందుకు అతనికంత ప్రయారిటీ?

చాలాకాలంగా టీమిండియా టెస్టు సన్నాహకాల్లో, మహ్మద్ షమీ అత్యంత కీలకమైన ఆటగాడు. బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగల నైపుణ్యంతో పాటు కంగారుపెట్టే పేస్… ప్రత్యర్థి బ్యాటర్లకు అతన్నో సింహస్వప్నంగా మార్చాయి. ఆకట్టుకునే గణాంకాలు, చివరిగా ఆడిన సిరీసుల్లో చూపిన ప్రతిభాపాటవాలు… ఇట్టే చెబుతాయి, అతనో విస్మరించలేని ప్లేయరని, ఎప్పటికీ ఆధారపడదగిన పేసర్ అని.  కఠినమైన, కచ్చితత్వానికి మారుపేరుగా నిలిచే తన పేస్ తో ప్రత్యర్థుల డిఫెన్స్ ను కకావికలు చేసిన షమీ టెస్టు క్రికెట్లో మేటిగా కెరీర్ మలచుకున్నాడు.

Mohammed Shami: షమీ కేవలం 64 టెస్టుల్లోనే 229 వికెట్లు తీశాడు,  అదీ 27.74 సగటుతో. దీన్ని బట్టే చెప్పవచ్చు అన్ని రకాల కండిషన్స్ లోనూ అతనెంతగా ప్రభావం చూపాడో. కెరీర్లో 4 వికెట్ల హాల్ 14 సార్లు అందుకున్న షమీ… 5 వికెట్ల హాల్ ను 6 సార్లు, 10 వికెట్ల హాల్ ను 2 సార్లు అందుకున్నాడు. బెస్ట్ బౌలింగ్ 56 పరుగులకు 6 వికెట్లు, అదీ పటిష్టమైన ఆస్ట్రేలియాపై. షమీ నమోదు చేసిన 3.03 ఎకానమీ రేట్ ఆటలో అతనెంతటి నియంత్రణలో ఉంటాడో చెబుతోంది. ఈ గణాంకాలు చాలు షమీ…టీమిండియాకు ఎంతటి కీలక ప్లేయరో చెప్పడానికి. 

అంతర్జాతీయ క్రికెట్లో, ప్రత్యేకించి టెస్టు క్రికెట్లో షమీని టాప్ క్లాస్ పేసర్ గా చూపే ఉదాహరణలెన్నో. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీనే తీసుకుంటే… షమీ 4 టెస్టుల్లో 21 వికెట్లు తీశాడు, 22.19 సగటుతో. అందులో రెండో టెస్టులో 56 పరుగులకు 6 వికెట్ల మ్యాచ్ విన్నింగ్ స్పెల్ కూడా ఉంది. షమీ విజృంభణతో టీమిండియా బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీని 2-1తో గెలిచింది. 2021 ఇంగ్లండ్ సిరీస్ లోనూ షమీ 4 టెస్టుట్లో 15 వికెట్లు తీశాడు. 25.13 సగటుతో. ఈ సిరీస్ ను టీమిండియా 3-1తో నెగ్గింది. 2020 న్యూజిలాండ్ సిరీస్ నూ టీమిండయా… షమీ ప్రతిభ కారణంగానే గెలిచింది. 2 టెస్టుల్లో ఈ బెంగాల్ పేసర్ 13 వికెట్లు తీశాడు, అదీ అబ్బురపరిచే 17.69 సగటుతో. అందులో రెండో టెస్టులో తీసిన 5 వికెట్ల హాల్ కూడా ఉంది.

ALSO READ  Emerging Asia Cup 2024: ఆసియా కప్‌ టీ20 టోర్నీ విజేత ఆఫ్ఘనిస్తాన్

ఎఫెక్టివ్ బౌలర్ గా షమీని నిలబెడుతున్నవి అతని పేస్, అంతకు మించిన స్వింగ్. దీనికి తోడు వేగాన్ని మేళవించి మరీ సీమ్ ను రాబట్టుకోగల అద్భుత నైపుణ్యం షమీ సొంతం. అందుకే, మేటి బ్యాటర్లు సైతం అతని బౌలింగ్లో షాట్లు ఆడేందుకు ఇబ్బందిపడుతుంటారు. ప్రత్యేకించి మేఘావృతమైన పరిస్థితుల్లో షమీని ఆడడం వికెట్తో చెలగాటమే. అనుకూల పరిస్థితుల్లో అతను మరింత ప్రమాదకారి అనడంలో సందేహమే లేదు. షమీకున్న బలాల్లో అడాప్టబిలిటీ ఒకటి. ఆస్ట్రేలియాలోని పేస్, స్వింగ్ కు అనుకూలించే పిచ్ లపైనే కాదు స్పిన్నర్లకు స్వర్గధామం లాంటి భారతదేశంలోని టర్నింగ్ ట్రాక్ ల పైనా వికెట్లు తీయగల సత్తా, నేర్పు…. షమీని వాల్డ్ టాప్ క్లాస్ పేసర్గా నిలిపాయి.

Mohammed Shami: 60 కి పైగా టెస్టులాడిన అనుభవంతో మహ్మద్ షమీ…టీమిండియా బౌలింగ్ దాడులను మరింతగా పదునెక్కించాడు. ప్రత్యేకించి మహ్మద్ సిరాజ్, ముఖేశ్ కుమార్, శార్దూల్ ఠాకూర్ తదితరులకే కాక తాజా దేశవాళీ సంచలనం ఆకాశ్ దీప్ వంటి బౌలర్లకు మార్గదర్శకంగా నిలిచాడు. అన్నింటికి మించి ఇతర బౌలర్లను కలుపుకుపోతూ దాడులకు పదునెక్కించే తీరు అనుసరనీయం. ప్రత్యేకించి బుమ్రాతో కలిసినపుడు…ఈ బౌలింగ్ ద్వయాన్ని అడ్డుకోవడం ఎలాంటి ప్రత్యర్థులకైనా అసాధ్యమే. షమీతో కూడిన బౌలింగ్ మేళవింపులన్నీ సక్సెస్సే.

మహ్మద్ షమీ జట్టులో కచ్చితంగా ఉండాలని కోరుకునేలా చేసే మరో కీలకాంశం… అతని నాయకత్వ పటిమ. బుమ్రా వంటి స్ట్రయిక్ బౌలర్ లేని సందర్భాల్లో ఆ లోటు కనిపించకుండా సహచర బౌలర్లను సమన్వయం చేసుకుంటూ బౌలింగ్ దాడులను ముందుకు తీసుకెళ్లగల సమర్థత షమీకుంది. జట్టులో పోటీతత్వం సడలిపోకుండా యువ బౌలర్లను సపోర్ట్ చేయడంలో మేటి ఈ బెంగాలీ స్పీడ్ స్టర్. ఇప్పటికే టీమిండియా ఆసీస్ గడ్డపై అడుగుపెట్టి ప్రాక్టీసు మొదలుపెట్టింది. అయితే ఆసీస్ లోని పేస్, బౌన్సీ పిచ్ లపై బుమ్రా మినహా ఇతర పేసర్లు ఎలాంటి ప్రభావం చూపగలరనే విషయంలో ఆందోళన అలాగే ఉంది. ఈ పరిస్థితుల్లో షమీ… ఫిట్ నెస్ ప్రూవ్ చేసుకుని మధ్య ప్రదేశ్ తో జరిగిన రంజీ మ్యాచ్లో 4 వికెట్లు తీయడం భారత శిబిరానికి ఊరటనిస్తోంది.

పేస్, స్వింగ్, అనుభవం, పిచ్ కు తగినట్లు సర్గుబాట్లు చేసుకోగల నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, ఎలాంటి కండిషన్స్ లోనైనా వికెట్లు తీయగల సత్తా.. షమీని టీమిండియా కూర్పులో అనివార్యంగా చేరుస్తున్నాయి. టెస్టు ఛాంపియన్ షిప్ అవకాశాలు మిణుకు మిణుకుమంటున్న తరుణంలో ఆసీస్ గడ్డపై ఆసీస్ ను ఓడించాలంటే షమీ జట్టులో ఉండడం తప్పనిసరి. టెస్టు క్రికెట్లో టీమిండియా ఆధిపత్యం కొనసాగాలన్నా అతని పాత్రే కీలకం. మహ్మద్ షమీ…ఓ మ్యాచ్ విన్నర్. అతను జట్టులో ఉంటే చాలు భారత్ ఎప్పటికీ బలమైన ప్రత్యర్థే అనడంలో సందేహమే లేదు.

ALSO READ  T20 Cricket: టీ20ల్లో ఈ రికార్డ్ ఎవరూ బద్దలు కొట్టలేరు.. 7 పరుగులకే ఆలౌట్ అయిన టీమ్

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *