MLC Nagababu: శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై జనసేన నేత, ఎమ్మెల్సీ నాగబాబు స్పందించారు. వర్షం పడితే బస్టాండ్ పూర్తిగా నీట మునిగి ప్రయాణికులు పడుతున్న కష్టాలపై ఫిర్యాదులు అందడంతో ఆయన స్వయంగా కాంప్లెక్స్‌ను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ నీటి మునక సమస్య గత 20 ఏళ్లుగా ఉందని, ఇప్పటికీ దీనికి శాశ్వత పరిష్కారం దొరకలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కౌన్సిల్‌లో కూడా ఈ సమస్యపై మంత్రులను అడిగానని తెలిపారు.
రోజుకు 60 వేల మంది ప్రయాణం: ప్రస్తుతం ఈ బస్టాండ్ నుండి రోజుకు దాదాపు 60 వేల మంది ప్రయాణిస్తున్నారని నాగబాబు వెల్లడించారు. ముఖ్యంగా వర్షాకాలంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మోకాల్లోతు నీటిలో నడవాల్సిన దుస్థితి నెలకొందని చెప్పారు.
సమస్యకు పరిష్కారాలు: ఈ సమస్యకు పరిష్కారంగా బస్టాండ్‌ను ఎత్తు పెంచాలని ఆయన సూచించారు. అంతేకాకుండా, ఇక్కడి అవసరాలకు తగ్గట్టుగా ఒక ఇంటిగ్రేటెడ్ బస్టాండ్‌ను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. ఇంటిగ్రేటెడ్ బస్టాండ్‌ను నిర్మిస్తే ప్రస్తుతమున్న 25 ప్లాట్‌ఫాంలను 45 ప్లాట్‌ఫాంలకు పెంచే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. దీనివల్ల ఆర్టీసీకి కమర్షియల్‌గా కూడా ఆదాయం పెరుగుతుందని తెలిపారు.
మంత్రులతో మాట్లాడతా: శ్రీకాకుళం బస్టాండ్ సమస్యపై త్వరలోనే మంత్రులతో మాట్లాడి, దీనికి శాశ్వత పరిష్కారం చూపడానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ‘స్త్రీ శక్తి’ ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించడం వల్ల బస్టాండ్‌లో మరింత రద్దీ పెరిగిందని, కాబట్టి సౌకర్యాలు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రయాణికుల దుస్థితి: కాగా, ప్రతి వర్షాకాలంలో శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ చెరువును తలపిస్తుంది. మురుగునీరు చేరి దుర్వాసన వ్యాపించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నెల 18న కురిసిన వర్షానికి కూడా కాంప్లెక్స్ పూర్తిగా జలమయమైంది. శాశ్వత పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో నాగబాబు పర్యటన అందరి దృష్టిని ఆకర్షించింది.