MLC Kavitha: తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం మరింత వేడెక్కింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై కవిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. అనంతరం డీజీపీని కూడా కలిసి ఫిర్యాదు చేయనున్నారు.
శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాసానికి వెళ్లిన కవిత, మల్లన్న వ్యాఖ్యలపై ఫిర్యాదు అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె, ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకోబోమని స్పష్టం చేశారు. మహిళలు రాజకీయాల్లో మాట్లాడకూడదా అని ప్రశ్నించిన కవిత, “ఆడబిడ్డను ఇష్టమొచ్చినట్లు మాట్లాడి.. మాండలికం అంటే ఎట్లా?” అని ప్రశ్నించారు. ఆడబిడ్డలను గౌరవించడం నేర్చుకోవాలని తీన్మార్ మల్లన్నకు హితవు పలికారు. మల్లన్న తనపై దారుణంగా మాట్లాడారని, వెంటనే ఆయన్ను అరెస్ట్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మల్లన్న విచక్షణతో మాట్లాడాలని కవిత సూచించారు. బీసీ అయినంత మాత్రాన ఏది పడితే అది మాట్లాడకూడదని అన్నారు. “నన్ను బయట తిరగనివ్వను అనటానికి మల్లన్న ఎవరు? పరుష పదజాలాన్ని తెలంగాణ ప్రజలు క్షమించరు” అని కవిత వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిని వెంటనే తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి ఇంటి బిడ్డలకు ఒక న్యాయం, ఇతరులకు మరొక న్యాయమా అని ప్రశ్నించిన కవిత, మల్లన్నను అరెస్ట్ చేయకపోతే ఆయన వెనుక ముఖ్యమంత్రి ఉన్నారని భావించాల్సి వస్తుందని అన్నారు. మల్లన్నపై జాతీయ మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేస్తామని కవిత పేర్కొన్నారు.
Also Read: CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పించిన సీఎం రేవంత్‌రెడ్డి
మరోవైపు, తీన్మార్ మల్లన్న తాను ఎక్కడా అగౌరవంగా మాట్లాడలేదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తన భాషలో తెలంగాణ మాండలీకం ఉందని చెప్పుకొచ్చారు. ఇది తనపై దాడి కాదని, యావత్తు బీసీలపై దాడని మల్లన్న వ్యాఖ్యానించారు. శనివారం జహీరాబాద్‌లో జరిగిన ఒక బీసీ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ కవితపై వ్యాఖ్యలు చేశారు. “బీసీలకు ఏమొస్తే నీకెందుకు.. నువ్వేమన్న బీసీవా.. కంచం పొత్తు ఉందా.. మంచం పొత్తు ఉందా” అంటూ కవితను ఉద్దేశించి చేసిన విమర్శలు ఈ వివాదానికి కారణమయ్యాయి.

