MLC Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై జరుగుతున్న సీబీఐ విచారణ, అవినీతి ఆరోపణల వెనుక పార్టీలోని కొందరు కీలక నేతల పాత్ర ఉందని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆమె కన్నీరు పెట్టుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
కవిత తన ఆరోపణలను ముఖ్యంగా మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ ఎంపీ సంతోష్‌రావులపై సంధించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో వీరిద్దరి పాత్ర కీలకమని ఆమె అన్నారు. హరీశ్‌రావు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నందువల్లే కేసీఆర్‌కు ఈ చెడ్డపేరు వచ్చిందని, అందుకే ఆయన్ని ఆ మంత్రి పదవి నుంచి తొలగించారని స్పష్టం చేశారు. కేసీఆర్‌ను అడ్డుపెట్టుకుని హరీశ్‌రావు, సంతోష్‌రావు భారీగా ఆస్తులు కూడబెట్టారని కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. వారికి డబ్బు తప్ప మరొకటి అవసరం లేదని ఆమె చెప్పారు.
హరీశ్‌రావు, సంతోష్‌రావు వెనుక ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఉన్నారని కవిత ఆరోపించారు. వీరి ముగ్గురి మధ్య లోపాయకారి ఒప్పందం కుదిరిందని, అందుకే రేవంత్ రెడ్డి వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆమె అన్నారు. “నా తండ్రిపైనే బాణం వేస్తారు, రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఈ ఇద్దరిపై చర్యలు తీసుకోవాలి” అని కవిత సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డికి తెలంగాణ అజెండా కాకుండా పక్క రాష్ట్ర అజెండాను అమలు చేసే వ్యక్తి అని కవిత తీవ్ర విమర్శలు చేశారు.
Also Read: Jupally Krishna Rao: ఈ సారి అంగరంగ వైభవంగా.. తెలంగాణలో బతుకమ్మ వేడుకలు
కేసీఆర్‌పై కుట్ర, పార్టీ మౌనం :
“నా తండ్రి హిమాలయ పర్వతం లాంటి వారు. ఆయనకు అవినీతి మరక అంటడం బాధగా ఉంది. నా తండ్రికి డబ్బు, తిండిపై ఏనాడూ ఆశ లేదు” అని కవిత ఆవేదన చెందారు. కాళేశ్వరం ప్రాజెక్టులో చిన్న భాగం మునిగితే మొత్తం ప్రాజెక్టు పోయినట్లు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఇంత జరుగుతున్నా పార్టీ నాయకులు మౌనంగా ఉండటంపై ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కేసీఆర్‌పై సీబీఐ విచారణ వేస్తే తెలంగాణ ప్రజలు, పార్టీ నాయకులు భగ్గుమనకుండా సైలెంట్‌గా ఉండటం దారుణమన్నారు. “నేనిప్పుడు మాట్లాడితే నా వెనుక ఎవరో ఉన్నారంటారు. కానీ అవినీతి అనకొండల మధ్య కేసీఆర్ బలిపశువు అవుతున్నారు” అని ఆమె కన్నీరు పెట్టుకున్నారు.
కాళేశ్వరంలో అవినీతి జరిగిందని, ఇద్దరు ఇరిగేషన్ అధికారుల దగ్గర వందల కోట్లు దొరికాయని కవిత గుర్తు చేశారు. “వారి వెనుక ఎవరు ఉన్నారో ప్రభుత్వం దర్యాప్తు చేయాలి” అని ఆమె డిమాండ్ చేశారు. హరీశ్‌రావు, సంతోష్‌రావు వల్లే కేసీఆర్‌కు ఈ దుస్థితి వచ్చిందని, వారి స్వార్థం కోసమే అవినీతికి పాల్పడ్డారని అన్నారు. ఈ విషయం బయటపెడితే పార్టీకి నష్టం జరిగినా తాను పట్టించుకోనని, ఇది తన తండ్రి పరువుకు సంబంధించిన విషయమని కవిత పేర్కొన్నారు. “ఖబడ్దార్ బిడ్డల్లారా, ఎంతవరకు వెళ్లినా నేను చూసుకుంటా” అని కవిత హెచ్చరించారు. కేసీఆర్ కడిగిన ముత్యంలా బయటపడతారని కవిత ధీమా వ్యక్తం చేశారు.