MLC Election 2025: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మూడేసి చొప్పున ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం (ఫిబ్రవరి 27న) ముమ్మరంగా కొనసాగుతున్నది. తెలంగాణలో రెండు ఉపాధ్యాయ, ఒకటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు గ్రాడ్యుయేట్, ఒకటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరుగుతున్నది.
MLC Election 2025: ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉదయం 8 గంటలకే ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. బ్యాలెట్ పేపరు పద్ధతిలో ఓటింగ్ జరుగుతున్నది. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ కొనసాగుతున్నది. అంతటా ఉత్కంఠ నెలకొన్నది. అన్నిస్థానాల్లో బహుళ పోటీ నెలకొనడంతో గెలుపోటములపై సందిగ్ధం నెలకొన్నది.
MLC Election 2025: తెలంగాణలో కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి 57 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఈ ఎన్నిక కోసం 499 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం నుంచి 15 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. దీనికోసం 274 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
MLC Election 2025: అదే విధంగా నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 19 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. దీనికోసం 200 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇదిలా ఉండగా కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో 3,55,155 మంది ఓటర్లు ఉండగా, ఇదే కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 27,088 మంది ఓటర్లు ఉన్నారు.
MLC Election 2025: నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో 25,759 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. మార్చి 3వ తేదీన ఆయా ఓట్ల లెక్కింపు చేపడుతారు. తొలి ప్రాధాన్య ఓటుతో గెలిచే అవకాశం ఉంటే అదేరోజు రాత్రి వరకు ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉన్నది. రెండో ప్రాధాన్య లెక్కించాల్సి వస్తే మాత్రం ఒకటి రెండు రోజుల అనంతరమే ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉన్నది.
ఇదిలా ఉండగా, తమ ఊళ్లకు రోడ్లు వేయలేదని పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్‌ను ఓ గ్రామం బహిష్కరించింది. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో రోడ్లు వేయలేదని ఆ మండలంలోని 244 మంది ఓటర్లు ఓటు వేయకుండా పోలింగ్‌ను బహిష్కరించడం గమనార్హం.