Ganjai: కేరళలో సీపీఎం ఎమ్మెల్యే యు.ప్రతిభ కుమారుడిపై గంజాయి కేసు ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. ఎక్సైజ్ శాఖ అధికారులు గంజాయి సిగరెట్లు తాగుతుండగా అరెస్టు చేసిన తొమ్మిది మందిలో ఆయన కుమారుడు కూడా ఉన్నారని వార్తలు వెలువడ్డాయి. అలప్పుజ జిల్లాలోని కుట్టనాడులో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. అయితే, పట్టుబడిన గంజాయి పరిమాణం చాలా స్వల్పంగా ఉండటంతో అందరినీ వెంటనే బెయిల్‌పై విడుదల చేశామని వెల్లడించారు.
ఈ వార్తలు మీడియా ద్వారా ప్రసారం కావడంతో ఎమ్మెల్యే యు.ప్రతిభ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుమారుడిని అరెస్టు చేసినట్టు వస్తున్న వార్తలు అసత్యమని పేర్కొన్నారు. ఎక్సైజ్ అధికారులు తన కుమారుడిని అతని స్నేహితులతో కలిసి కూర్చున్న సమయంలో ప్రశ్నించారనీ, కానీ అతడిని అరెస్టు చేయలేదని స్పష్టం చేశారు.
తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దని, మీడియా జాగ్రత్తగా వ్యవహరించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ఈ వార్తల వల్ల తనకు అనేక మంది ఫోన్ చేస్తోన్నారని, నిరాధార కథనాలను వెంటనే ఆపాలని కోరారు. “నా కుమారుడు నిజంగానే నేరానికి సంబంధం ఉన్నాడని నిరూపణ అయితే బహిరంగంగా క్షమాపణ చెబుతాను. కానీ తప్పుడు వార్తలైతే మీడియా కూడా క్షమాపణ చెప్పాలి” అని ఆమె అన్నారు.
ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే కుమారుడు కూడా స్పందించాడు. తనను గంజాయి కేసులో అరెస్టు చేశారనే వార్తల్లో నిజం లేదని స్పష్టం చేస్తూ సోషల్ మీడియా వేదికగా వివరాలు తెలియజేశాడు.