Komatireddy Raj Gopal Reddy: ప్రయాణీకుల భద్రతపై ఆటో డ్రైవర్ల నిర్లక్ష్యంపై మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకున్న ఓ ఆటో డ్రైవర్‌కు ఆయన నడిరోడ్డుపై క్లాస్ పీకారు.
విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం
ప్రైవేటు వాహనదారులు, ముఖ్యంగా ఆటోవాలాలు లాభం కోసం ఇష్టమొచ్చినట్లుగా ప్రయాణికులను ఎక్కిస్తున్నారు. అధికారులు హెచ్చరించినా పట్టించుకోవడం లేదు. పరిమితికి మించిన ప్రయాణం చేయించడం, మితిమీరిన వేగంతో నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా, చిన్నారి విద్యార్థుల ప్రాణాలతో ఆటో డ్రైవర్లు చెలగాటం ఆడుతున్నారని ఆందోళన వ్యక్తమవుతోంది.
ఆటోను ఆపి వార్నింగ్ ఇచ్చిన ఎమ్మెల్యే
మునుగోడు నియోజకవర్గంలో కూడా ఇలాంటి పరిస్థితే కనిపించింది. నారాయణపూర్ నుండి చౌటుప్పల్ వైపు అతివేగంగా వస్తున్న ఓ ఆటోను ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గమనించారు. ఆ ఆటోలో చిన్నపిల్లలు మరియు మహిళలు పరిమితికి మించి కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు.
వెంటనే స్పందించిన ఎమ్మెల్యే.. చౌటుప్పల మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లి శివారు వద్ద ఆ ఆటోను ఆపారు.
రాజగోపాల్ రెడ్డి డ్రైవర్‌తో మాట్లాడుతూ.. “ఏదైనా జరగరానిది జరిగితే, ఈ చిన్నపిల్లలు, మహిళలు ప్రాణాలు కోల్పోతారు కదా. మీకు ఎంత నిర్లక్ష్యం?” అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. “మరోసారి ఇలా పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుంటే బాగోదు! పద్ధతి మార్చుకోవాలి” అంటూ ఆటో డ్రైవర్‌కు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ప్రయాణీకుల భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని ఆయన ఆటో డ్రైవర్లను హెచ్చరించారు.