Mandadi

Mandadi: సుహాస్ సినిమా షూటింగ్‌లో అపశ్రుతి: సముద్రంలో పడవ బోల్తా

Mandadi: ప్రముఖ తమిళ నటుడు సూరి, టాలీవుడ్‌ నటుడు సుహాస్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ద్విభాషా చిత్రం ‘మండాడి’ షూటింగ్‌లో పెను ప్రమాదం జరిగింది. తమిళనాడులోని రామనాథపురం జిల్లా, తొండి సముద్ర తీరంలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్న సమయంలో, సాంకేతిక నిపుణులు ప్రయాణిస్తున్న ఒక పడవ ప్రమాదవశాత్తూ బోల్తా పడింది. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది.

ఘటన వివరాలు:
సముద్రంలో చిత్రీకరణ జరుగుతున్న సమయంలో, పడవ బోల్తా పడటంతో దానిలో ఉన్న ఇద్దరు సాంకేతిక నిపుణులు నీట మునిగారు. అలాగే, దాదాపు రూ. కోటి విలువైన కెమెరాలు, ఇతర సాంకేతిక సామగ్రి కూడా నీటిలో పడిపోయి కొట్టుకుపోయాయి. ఈ ప్రమాదంతో సినిమా యూనిట్‌కు భారీ ఆస్తి నష్టం వాటిల్లింది.

Also Read: Bigg Boss 9: బిగ్ బాస్ వీకెండ్ ఫైర్: నాగార్జున క్లాస్; సంజనకు దొంగతనం శిక్ష

పడవ బోల్తా పడిన వెంటనే సినిమా యూనిట్ సభ్యులు అప్రమత్తమై, నీట మునిగిన ఇద్దరు వ్యక్తులను తక్షణమే రక్షించగలిగారు. దీంతో వారికి ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు. ప్రమాదం జరిగిన సమయంలో నటులు సూరి, సుహాస్‌ పడవలో లేకపోవడం వల్ల సురక్షితంగా బయటపడినట్లు సమాచారం.

జాతీయ అవార్డు గ్రహీత వెట్రిమారన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, మతిమారన్‌ పుగళేంది దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా తమిళం, తెలుగు భాషల్లో ఏకకాలంలో రూపొందుతోంది. తమిళ వెర్షన్‌లో సూరి హీరోగా నటించగా, తెలుగు నటుడు సుహాస్ ఈ చిత్రంతో కోలీవుడ్‌లో విలన్‌గా అడుగుపెడుతున్నాడు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా షూటింగ్ తాత్కాలికంగా నిలిచిపోయినట్లు తెలుస్తోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *