Nara Lokesh: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ తన నిరాడంబరమైన, కార్యకర్తలకు ప్రాధాన్యమిచ్చే వ్యక్తిత్వాన్ని మరోసారి చాటుకున్నారు. తమ అభిమాన నాయకుడు తమ పెళ్లికి రావాలని కోరుతూ ఒక మహిళా అభిమాని పంపిన ఆహ్వానాన్ని మన్నించి, లోకేశ్ నేరుగా వారి ఇంటికి వెళ్లి ఆశ్చర్యపరిచారు.
పాదయాత్ర నుంచి అభిమానిగా…
విజయవాడ మొగల్రాజపురానికి చెందిన భవానీ (భవ్య) అనే యువతి, గతంలో 2023 ఆగస్టు 20న లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో ఉత్సాహంగా పాల్గొని సంఘీభావం తెలిపారు. ఆ పాదయాత్ర ద్వారా లోకేశ్‌కు వీరాభిమానిగా మారిన భవ్య, తన వివాహానికి విచ్చేసి ఆశీర్వదించాల్సిందిగా ఇటీవల మంత్రికి ఆహ్వాన పత్రిక పంపించారు.
Also Read: Narne Nithin: ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ పెళ్లి ముహూర్తం ఫిక్స్!
అభిమాని ఇంట అకస్మాత్తుగా ప్రత్యక్షం
శనివారం రాత్రి గన్నవరం ఎయిర్‌పోర్టు సమీపంలోని కల్యాణ మండపంలో భవ్య వివాహం జరగాల్సి ఉంది. బిజీ షెడ్యూల్‌లో ఉన్నప్పటికీ, మంత్రి లోకేశ్ శనివారం మధ్యాహ్నం మొగల్రాజపురంలోని భవ్య ఇంటికి అకస్మాత్తుగా వచ్చారు. అభిమాన నాయకుడు తమ ఇంటికి అనూహ్యంగా రావడంతో పెళ్లికూతురు భవ్యతో పాటు ఆమె తల్లిదండ్రులు నాగుమోతు రాజా, లక్ష్మి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. లోకేశ్‌ను చూసి వారు ఉద్వేగానికి లోనయ్యారు.
మంత్రి లోకేశ్, భవ్యను మనస్ఫూర్తిగా ఆశీర్వదించి వారికి పెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, తెదేపా నేత కంభంపాటి రామ్మోహనరావు తదితరులు లోకేశ్ వెంట ఉన్నారు. తమ నాయకుడు చూపిన ఈ అభిమానం తెదేపా కార్యకర్తలు, అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది.
View this post on Instagram