Nara Lokesh: విదేశీ పెట్టుబడుల సాధన, విద్యా విధానాల అధ్యయనం లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు ఆస్ట్రేలియాలో ఆరు రోజుల పర్యటనకు బయలుదేరుతున్నారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం పంపిన ప్రత్యేక ఆహ్వానం (స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్) మేరకు ఆయన ఈ పర్యటన చేపట్టనున్నారు.
ఈ పర్యటనలో మంత్రి లోకేశ్ ప్రధానంగా రెండు లక్ష్యాలపై దృష్టి సారించనున్నారు. మొదటిది, ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ న్యూసౌత్ వేల్స్‌తో సహా పలు విద్యా సంస్థలను సందర్శించి, అక్కడ అమలవుతున్న అధునాతన బోధనా పద్ధతులు, విద్యా విధానాలపై లోతుగా అధ్యయనం చేయనున్నారు. ఈ సమాచారాన్ని ఏపీలోని విద్యా రంగంలో సంస్కరణలకు వినియోగించుకోవాలని ఆయన యోచిస్తున్నారు.
Also Read: Ravindra Jadeja: నిన్ను చూస్తే గర్వంగా ఉంది అంటూ జడేజా ఎమోషనల్ పోస్ట్
రెండవది, విశాఖపట్నంలో నవంబర్ 14, 15 తేదీల్లో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు (CII Partnership Summit) కు విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు సిడ్నీ, మెల్బోర్న్ నగరాల్లో రోడ్ షోలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆస్ట్రేలియా స్కిల్స్ & ట్రైనింగ్ మంత్రి ఆండ్రూ గిల్స్, బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా ప్రతినిధులతో సమావేశమై ఏపీలో పెట్టుబడుల అవకాశాలను వివరించనున్నారు. ఆదివారం ఉదయం సిడ్నీ చేరుకున్న తర్వాత, ఆయన సాయంత్రం తెలుగు డయాస్పోరా సమావేశంలో కూడా పాల్గొంటారు. రాష్ట్ర ఆర్థిక, సాంకేతిక రంగాలలో పురోగతికి ఈ పర్యటన దోహదపడుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది.