minister konda surekha: ప్రతి పౌరుడు పర్యావరణాన్ని కాపాడే బాధ్యతను తీసుకోవాలని రాష్ట్ర పర్యావరణ, అటవీ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని (ఎర్త్ డే) పురస్కరించుకొని “ఎర్త్ డే – స్టూడెంట్, యూత్ ఇన్ యాక్షన్” పేరుతో ఒక పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
భూమి అనేది అన్ని జీవరాశులకూ ఆధారం అని పేర్కొన్నారు. మనిషికి జీవనాధారంగా గాలి, నీరు, ఆహారం, ఉపాధిని భూమి సమకూర్చుతుందని చెప్పారు. కానీ వాతావరణ మార్పులు, మానవ క్రియల వల్ల ప్రకృతి వనరులు త్వరగా నాశనమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి అని పిలుపునిచ్చారు. గ్రీన్‌హౌస్ వాయువుల ఉత్పత్తిని తగ్గించేందుకు పెట్రోల్, డీజిల్ వంటివి బదులుగా సౌరశక్తి, పవనశక్తి వంటి పునరుత్పాదక ఇంధనాలను వినియోగించాలని సూచించారు.
భవిష్యత్ తరాల కోసం భూమిని రక్షించాల్సిన అవసరం ఉందని, అందుకోసం సోలార్ ఎనర్జీ వినియోగం ఎంతో ముఖ్యం అని మంత్రి చెప్పారు. ఈ దిశగా దేవాదాయ శాఖకు చెందిన భూములపై సోలార్ ఎనర్జీ ప్రాజెక్టులు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ప్రతి ఒక్కరూ తమ స్థాయిలో సోలార్ ఎనర్జీని వినియోగించుకునేలా ప్రయత్నించాలి. ఈ మార్పులు మనం చేసే చిన్న చిన్న అడుగులు గానీ, పర్యావరణ పరిరక్షణలో పెద్ద మార్పులకు దారి తీస్తాయని ఆమె హితవు పలికారు.