Gottipati Ravi Kumar: మోంథా తుపాను కారణంగా వీచిన బలమైన ఈదురు గాలులకు రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థ చాలా దెబ్బతింది. ఈ విషయాన్ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. మచిలీపట్నంలో మరో మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి పర్యటించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
తుఫాను వలన కరెంట్ స్తంభాలు పెద్ద సంఖ్యలో పడిపోయాయని, కొన్ని ప్రాంతాల్లో లైన్లు తెగిపోయాయని మంత్రి గొట్టిపాటి తెలిపారు. అయితే, దెబ్బతిన్న ఈ విద్యుత్ వ్యవస్థను తిరిగి సరిచేయడానికి అధికారులు చాలా వేగంగా పనులు మొదలుపెట్టారని ఆయన వెల్లడించారు. ఎవరికీ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ఉండేందుకే, తుఫాను వచ్చే ముందు జాగ్రత్తగా కరెంటు సరఫరాను ఆపివేశామని చెప్పారు. దీనివల్ల పెద్ద ప్రమాదాలు జరగకుండా కాపాడగలిగామని పేర్కొన్నారు.
మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ, సుమారు 20 వేల ఇళ్లకు తిరిగి కరెంటు ఇవ్వాల్సి ఉందని తెలిపారు. వర్షాలు పడుతుండటం వల్ల మరమ్మతు పనుల్లో కొంచెం ఆలస్యం జరిగింది. అయినప్పటికీ, ఈరోజు మధ్యాహ్నం లోగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకూ విద్యుత్ సరఫరాను పూర్తిగా పునరుద్ధరిస్తామని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. అధికారులు, సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారని ఆయన తెలిపారు.

