Minister: పంజాబ్‌లో ఒక మంత్రి లేని శాఖకు 20 నెలల పాటు పనిచేసిన సంఘటన జరిగింది. పంజాబ్‌లో ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నాయకత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ పాలన సాగిస్తోంది. మార్చి 2022లో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత భగవంత్ మాన్ నేతృత్వంలోని మంత్రివర్గం అధికారం చేపట్టినప్పుడు, పార్టీ సీనియర్ నాయకుడు కుల్దీప్ సింగ్ తలివాల్ వ్యవసాయం, విదేశీ భారతీయుల సంక్షేమం అనే రెండు శాఖలకు మంత్రిగా నియమితులయ్యారు.
తరువాత, మే 2023లో జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సమయంలో, వ్యవసాయ శాఖను మాత్రమే తొలగించి, పరిపాలనా సంస్కరణల శాఖను కేటాయించారు. అంటే అప్పటి నుంచి ఆయన పరిపాలనా సంస్కరణల శాఖ, విదేశీ భారతీయుల సంక్షేమ శాఖల మంత్రి అయ్యారు. అయితే ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఉంది. అసలు పరిపాలనా సంస్కరణలు అనే విభాగం లేదని, దానికోసం ఒక మంత్రిని నియమించారని తాజాగా బయట పడింది. అంటే లేని శాఖకు కూడా ఒక మంత్రిని నియమించుకున్నారన్నమాట.
బయటపడింది ఇలా..
Minister: అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను ఇటీవల వెనక్కి పంపించి పంజాబ్‌కు తీసుకువచ్చినప్పుడు ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈమధ్య ట్రంప్ అమెరికా నుంచి అందరినీ వెనక్కి పంపిస్తున్న సందర్భంలో అక్రమంగా ఉంటున్న భారతీయులను అమృత్ సర్ విమానాశ్రయానికి చేరుస్తున్నారు. ఈ సందర్భంగా ప్రవాస భారతీయుల మంత్రి తలివాల్ పేరు తరచుగా వార్తల్లో కనిపిస్తోంది. దీంతో ఆయన పరిపాలనా సంస్కరణల శాఖ కూడా చర్చనీయాంశంగా మారింది, పంజాబ్‌లో అలాంటి శాఖ లేదనే నిజం బయటపడింది.
Minister: ఈ వివాదం మధ్య, కుల్దీప్ సింగ్ తలివాల్ విదేశాల్లో ఉన్న భారతీయుల సంక్షేమాన్ని మాత్రమే చూసుకుంటారు. జరిగిన తప్పు బయటపడిన తరువాత పంజాబ్ ప్రభుత్వం నాలిక్కరుచుకుంది. హడావిడిగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసి, ఆయనకు కేటాయించిన పరిపాలనా సంస్కరణల శాఖ ఇక లేదని పేర్కొంది.
Minister: దీనిపై ముఖ్యమంత్రి భగవంత్ మాన్ వివరిస్తూ, “పరిపాలనా సంస్కరణల శాఖ అనేది కేవలం పేరు మాత్రమే, దానికి ఎలాంటి కార్యాలయం లేదు. “మేము దానిని ప్రభుత్వ పరిపాలన విభాగంలో విలీనం చేసాము” అని ఆయన అన్నారు.