Earthquake

Earthquake: వికారాబాద్ జిల్లాలో భూప్రకంపనలు.. పరుగులు తీసిన జనాలు

Earthquake: వికారాబాద్ జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఉదయం 4 గంటల ప్రాంతంలో ఈ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్‌పై ఈ భూకంపం తీవ్రత 3.8గా నమోదైంది. వికారాబాద్‌లోని పరిగి మండలం, ముఖ్యంగా బసిరెడ్డిపల్లి, రంగాపూర్ మరియు న్యామత్ నగర్ వంటి గ్రామాలలో ప్రజలు భూమి కంపించడాన్ని గుర్తించారు. సుమారు మూడు సెకన్ల పాటు భూమి కంపించడంతో భయాందోళన చెందిన స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. నిద్రలో ఉన్న చాలామంది ఉలిక్కిపడి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. స్థానికుల కథనం ప్రకారం, “ఉన్నట్టుండి భూమి కంపించడం వల్ల చాలా భయపడ్డాం. ఇళ్లలోని వస్తువులు కదిలాయి, కొన్ని చోట్ల గోడలపై పగుళ్లు కూడా కనిపించాయి,” అని తెలిపారు.

అయితే, ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు ఇప్పటివరకు ఎలాంటి నివేదికలు అందలేదు. భూకంప కేంద్రం ఆసిఫాబాద్‌ వద్ద ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కాగా, తెలంగాణలో గత మే నెలలో కూడా నిర్మల్, నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్ మరియు ఉమ్మడి మెదక్ జిల్లాల్లో స్వల్ప భూప్రకంపనలు నమోదయ్యాయి. ఈ భూప్రకంపనలపై అధికారులు స్పందిస్తూ, ఇది చాలా స్వల్ప స్థాయి భూకంపమని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. ప్రస్తుతం, విపత్తు నిర్వహణ బృందాలు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. నిపుణుల ప్రకారం, తెలంగాణ ప్రాంతం తక్కువ భూకంప ప్రమాద జోన్‌ లో ఉన్నప్పటికీ, గత కొన్ని నెలలుగా ఇలాంటి స్వల్ప భూకంపాలు అసాధారణంగా నమోదవుతున్నాయి. దీనికి గల కారణాలపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *