Mike Tyson: ఒకప్పుడు పందెం రాయుళ్ల పంట పండించిన మాజీ ప్రపంచ హెవీ వెయిట్ ఛాంపియన్ మైక్ టైసన్.. రిటైరయ్యాక కూడా తన ప్రభావాన్ని చూపిస్తున్నాడు. తాజాగా యూట్యూబర్ నుంచి బాక్సర్గా మారిన జేక్ పాల్కు టైసన్కు మధ్య జరిగిన బౌటు భారీగా బెట్టింగ్ జరిగింది. ప్రస్తుత వయసు, ఫిట్నెస్ను దృష్టి పెట్టుకుంటే 58 ఏళ్ల టైసను ఈ బౌట్లో గెలవడం కష్టమే అయినా.. పాల్పై అతడిదే పైచేయి కావాలని చాలామంది కోరుకున్నారు. టైసన్-పాల్ మధ్య పోరు బాక్సింగ్ లేదా మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఎక్కువమంది బెట్టింగ్ వేసిన బౌట్గా నిలిచింది. ఎన్ఎఫ్ఎల్ గేమ్తో సమానంగా దీనికి అభిమానులు బెట్ కట్టారు. “టైసన్ బౌట్ అంటే అభిమానుల్లో ఉండే క్రేజ్ ముందే తెలుసు. జేక్కు టైసన్కు మధ్య వయసు వ్యత్యాసాన్ని కూడా చూడకుండా పందేలు కట్టారు. తమ అభిమాన బాక్సర్ను రింగ్లో చూసేందుకు ఎగబడ్డారు” అని సీజర్స్ స్పోర్ట్స్ బెట్టింగ్ ప్రతినిధి క్రెయిగ్ మెక్లో చెప్పాడు.
