Meena: మీనా ఇటీవల ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగులో ప్రసారమవుతున్న ‘జయం నిశ్చయమ్మురా’ అనే టాక్ షోలో నటుడు జగపతిబాబుతో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె తన కెరీర్, వ్యక్తిగత జీవితం గురించి అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మీనా తన దివంగత స్నేహితురాలు, నటి సౌందర్యతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సౌందర్య ఎంత సరదాగా ఉండేవారో, ఆమె మరణం తనని ఎంత బాధించిందో ఎమోషనల్‌గా పంచుకున్నారు.
ఈ సందర్భంగా, జగపతిబాబు కూడా సౌందర్యతో తనకున్న అనుబంధం గురించి మాట్లాడారు.మీనా భర్త మరణం తర్వాత వచ్చిన రెండో పెళ్లి పుకార్లపై కూడా ఈ షోలో స్పందించారు. భర్తను కోల్పోయిన తర్వాత చాలా కష్టమైన దశను ఎదుర్కొన్నానని, పని, స్నేహితులు తనని ఆ బాధ నుంచి బయటపడేలా సహాయపడ్డారని చెప్పారు.
ఇది కూడా చదవండి: Aisa Cup 2025: పాకిస్థాన్-భారత్ మ్యాచ్ లో జలేబి బేబీ పాట
భర్త విద్యాసాగర్ మరణం తర్వాత, చాలామంది రెండో పెళ్లి గురించి అడిగి తనని ఇబ్బంది పెట్టారని మీనా గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. దేశంలో తనలాగే ఒంటరిగా ఉన్న ఎంతోమంది మహిళలు ఉన్నారని, వారి వ్యక్తిగత విషయాలపై ఇతరులు అనుచితంగా వ్యాఖ్యానించడం సరికాదని ఆమె ఘాటుగా స్పందించారు. ఏ హీరో విడాకులు తీసుకున్న మీనాతో రెండో పెళ్ళంటూ వార్తలు రాస్తున్నారని మండిపడ్డారు. ఈ కష్ట సమయంలో తన తల్లిదండ్రులు, కూతురు నైనిక తనకు అండగా నిలిచారని, వారి కోసమే తాను ధైర్యంగా ముందుకు వెళ్తున్నానని మీనా తెలిపారు.
కొత్త సినిమాల స్క్రిప్ట్‌లు బాగుంటే, తప్పకుండా సినిమాలు చేస్తానని, పనిలో బిజీగా ఉండడం వల్ల తన బాధను మరిచిపోవడానికి సహాయపడుతుందని చెప్పారు. ప్రస్తుతం తన దృష్టి మొత్తం కూతురు నైనిక భవిష్యత్తుపైనే ఉందని, రెండో పెళ్లి గురించి ఆలోచించడం లేదని స్పష్టం చేశారు. ఒకవేళ భవిష్యత్తులో అలాంటి నిర్ణయం ఏదైనా తీసుకుంటే, తానే స్వయంగా ప్రకటిస్తానని తెలిపారు.