Medico Priyanka: రాజమహేంద్రవరంలో మద్యం మత్తులో కొందరు యువకులు కారుతో నిర్లక్ష్యంగా ఢీకొట్టిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూసిన వైద్య విద్యార్థిని ప్రియాంక (28) మృతదేహానికి హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తయింది. అనంతరం వైద్యులు భౌతికకాయాన్ని కన్నీరుమున్నీరవుతున్న ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన ₹20 లక్షల పరిహారానికి సంబంధించిన చెక్‌ను అందించేందుకు ఏపీ మంత్రి టీజీ భరత్ స్వయంగా ఎక్లాస్పూర్ గ్రామానికి వెళ్లనున్నారు. ప్రియాంక కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, నిందితులకు కోర్టు ద్వారా కఠిన శిక్ష పడేలా చట్టపరమైన చర్యలు వేగవంతం చేశామని అధికారులు వెల్లడించారు. ఎంతో ప్రయోజకురాలవుతుందనుకున్న కూతురు అర్ధాంతరంగా నిష్క్రమించడంతో ఎక్లాస్పూర్ గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.
