Darshan: కన్నడ సంచలనం సృష్టించిన రేణుకాస్వామి హత్య కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో 14వ నిందితుడిగా ఉన్న నటుడు దర్శన్ (Darshan) ముఖ్య అనుచరుడు ప్రదోష్ అప్రూవర్‌గా మారేందుకు అంగీకరించారు. హత్య జరిగిన రోజు నుంచి సాక్ష్యాలు ధ్వంసం చేసే వరకు షెడ్లో ఏం జరిగింది? అనే విషయాలను వివరిస్తూ ఆయన బెంగళూరులోని 59వ సెషన్స్ కోర్టులో సంచలన పిటిషన్ దాఖలు చేశారు.
ఛాతీపై కాళ్లతో తొక్కి.. చంపేశారు!.. పిటిషన్లో షాకింగ్ విషయాలు
పవిత్ర గౌడకు సోషల్ మీడియాలో అభ్యంతరకర మెసేజ్‌లు పంపాడన్న నెపంతో చిత్రదుర్గకు చెందిన మెడికల్ రిప్రజెంటేటివ్ రేణుకాస్వామిని బెంగళూరులోని షెడ్‌కు రప్పించి నటుడు దర్శన్, ఆయన గ్యాంగ్ విచక్షణారహితంగా చితకబాదిన తీరును ప్రదోష్ తన పిటిషన్లో వివరించారు..
-
చెప్పుతో కొట్టించిన దర్శన్: రేణుకాస్వామిని గదిలో వేసి తీవ్ర పదజాలంతో దూషిస్తూ దర్శన్ దాడి చేశారని.. ఆ తర్వాత పవిత్ర గౌడను అక్కడికి పిలిపించి రేణుకాస్వామిని చెప్పుతో కొట్టించారని పేర్కొన్నారు.
-
నైలాన్ తాడుతో కట్టేసి దాడి: బట్టలు ఊడదీసి, లోదుస్తులతో టాటా ఏస్ వాహనానికి వేలాడదీసి నైలాన్ తాళ్లు, కర్రలతో దారుణంగా కొట్టారని చెప్పారు.
-
ఛాతీపై నిలబడి తొక్కారు: “ఇంత దారుణంగా కొడితే అతడు చనిపోతాడని నేను వారించినా ఎవరూ వినలేదు. దర్శన్ తన కాలితో రేణుకాస్వామి మెడ, ఛాతీపై గట్టిగా తన్నారు. బాధితుడు కిందపడిపోయాక రెండు కాళ్లతో ఆయన ఛాతీపై నిలబడి తొక్కేందుకు యత్నించగా నేను అడ్డుకుని దర్శన్‌ను పక్కకు లాగాను” అని ప్రదోష్ వెల్లడించారు.
మృతదేహం తరలింపు.. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులు!
రేణుకాస్వామి ప్రాణాలు కోల్పోయాడని తెలిసాక తీవ్ర భయాందోళనకు గురైన దర్శన్.. ఈ విషయం బయటకు వస్తే తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించినట్లు ప్రదోష్ ఆరోపించారు.
-
ఈ విషయాన్ని సద్దుమణిగేలా చేసేందుకు, కేసును వేరే మార్గానికి మళ్లించేందుకు మృతదేహాన్ని వేరే ప్రాంతానికి తరలించి కల్పిత కథను సృష్టించారని చెప్పారు.
-
హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు నిజాయితీగా కోర్టుకు చెబుతానని, తనకు మిగిలిన నిందితుల నుంచి ప్రాణహాని ఉన్నందున ప్రత్యేక భద్రతతో కూడిన సెల్లో ఉంచాలని ప్రదోష్ కోరారు.
ప్రదోష్‌తో పాటు మరో ఇద్దరు నిందితులు కూడా అప్రూవర్‌గా మారేందుకు దరఖాస్తు చేసుకోగా.. షరతులతో కూడిన మద్దతు తెలిపిన ప్రాసిక్యూషన్ వాదనలు విన్న న్యాయస్థానం ఈ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసింది.
