Mavoist : తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలు మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలించాయి. ఉసురు పోలీస్‌స్టేషన్ పరిధిలోని కర్రెగుట్ట ప్రాంతాన్ని కేంద్రంగా తీసుకొని 21 రోజుల పాటు కొనసాగిన ప్రత్యేక ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. ఈ ఆపరేషన్‌లో మొత్తం 31 మంది మావోయిస్టులు మృతి చెందారు అని సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ జీపీ సింగ్, ఛత్తీస్‌గఢ్ డీజీపీ అరుణ్‌దేవ్ గౌతం బుధవారం బీజాపూర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు.
వీరిలో 16 మంది మహిళలు ఉన్నారని అధికారులు తెలిపారు. మృతులపై ప్రభుత్వం గతంలో కలిపి రూ.1.72 కోట్లు రివార్డు ప్రకటించిందని వివరించారు. ఈ ఎదురుకాల్పుల్లో 18 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు.
ఇప్పటివరకు 20 మృతదేహాలను గుర్తించామని, మిగిలిన 11 మందిని గుర్తించాల్సి ఉందని వారు తెలిపారు. ఘటనా స్థలంలో నుంచి 35 ఆధునిక ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
ఈ కర్రెగుట్ట ఆపరేషన్ ఈ ఏడాది ఏప్రిల్ 21న ప్రారంభమై మే 11వ తేదీ వరకు కొనసాగిందని అధికార వర్గాలు వివరించాయి. మావోయిస్టులపై ఈ ఏడాది ప్రారంభం నుంచి చేపట్టిన చర్యలలో ఇప్పటివరకు 174 మంది మావోయిస్టుల మృతదేహాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.

