Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు మరోసారి ఘాతుకానికి పాల్పడ్డారు. రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్న ఓ కాంట్రాక్టర్‌ను కిడ్నాప్ చేసి, అత్యంత దారుణంగా హత్య చేశారు. మావోయిస్టుల హెచ్చరికలను లెక్కచేయకుండా పనులు కొనసాగించడమే ఈ కిరాతక చర్యకు కారణంగా తెలుస్తోంది. ఈ ఘటన ఏజెన్సీ గ్రామాల్లో తీవ్ర భయాందోళనలు సృష్టించింది.
బీజాపూర్ పామేడులో దారుణం
బీజాపూర్ జిల్లాలోని పామేడ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం ఈ ఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇంతియాజ్ అలీ అనే వ్యక్తి ఛత్తీస్‌గఢ్‌లో రోడ్డు పనులు చేసే ఓ కాంట్రాక్టర్ వద్ద గుమస్తాగా (కొన్ని కథనాల ప్రకారం కాంట్రాక్టరే) పనిచేస్తున్నాడు.
ఇది కూడా చదవండి: Vikram Bhatt Arrest: రూ. 30 కోట్ల మోసం కేసులో దర్శకుడు విక్రమ్ భట్ అరెస్ట్
ఇంతియాజ్ అలీ నారాయణపూర్ జిల్లాలో పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఇటీవల ఇరపల్లి గ్రామం మీదుగా రోడ్డు నిర్మాణ పనుల నిమిత్తం పామేడుకు వచ్చాడు.అయితే, ఈ ప్రాంతంలో రోడ్డు పనులు చేపట్టవద్దని మావోయిస్టులు అతడిని ఇప్పటికే గట్టిగా హెచ్చరించారు. మావోయిస్టుల హెచ్చరికలను పట్టించుకోకుండా ఇంతియాజ్ అలీ పనులు కొనసాగిస్తుండడంతో, ఆదివారం మావోయిస్టులు అతడిని అపహరించారు.
కాంట్రాక్టర్‌ను బెదిరించి.. గొంతు కోసి హత్య
కిడ్నాప్ చేసిన తరువాత, తమ ప్రాంతంలో రోడ్డు పనులను తక్షణమే నిలిపివేయాలని మావోయిస్టులు కాంట్రాక్టర్‌ను బెదిరించారు. ఆ తర్వాత కొద్ది సేపటికే, పామేడు పోలీస్టేషన్ పరిధిలోని గొల్లపల్లి ఏరియాలో ఇంతియాజ్ అలీని అత్యంత దారుణంగా గొంతు కోసి హత్య చేశారు.
ఉదయం ఈ డెడ్‌బాడీని చూసిన స్థానిక పామేడు గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ ఈ కిరాతక హత్య జరిగిన విషయాన్ని ధ్రువీకరించారు. అభివృద్ధి పనులకు ఆటంకం కలిగించడమే లక్ష్యంగా మావోయిస్టులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులు భావిస్తున్నారు. తాజా ఘటనతో ఏజెన్సీ గ్రామ ప్రజలు తీవ్ర భయంతో వణికిపోతున్నారు.

