Hyderabad: హైదరాబాద్ నగరంలో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్నది. ఓ అపార్ట్‌మెంట్‌లో చెలరేగిన మంటలు వ్యాపించి తీవ్ర ఆస్తి నష్టానికి దారితీసింది. అయితే ప్రాణనష్టం మాత్రం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే మంటలను ఆర్పేందుకు ఫైరింజన్ వచ్చినా లోనికి వెళ్లేందుకు దారి లేక సిబ్బంది ఇబ్బందులు పడ్డారు. ఈ ఘటన నగరంలోని అపార్ట్‌మెంట్ వాసుల్లో ఆందోళన కలిగిస్తున్నది.
Hyderabad: నగరంలోని పుప్పాల్‌గూడలోని గోల్డెన్ ఓరియల్ అపార్ట్‌మెంట్‌లోని ఓ ప్లాట్‌లో గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలింది. దీంతో ఆ ప్లాట్‌లో మంటలు చెలరేగాయి. ఆ ప్లాట్‌లో నివాసముండే ఐదుగురు కుటుంబ సభ్యులు హాహాకారాలు చేస్తూ బయటకు పరుగులు తీశారు. మంటలను చూసిన ఇతర ప్లాట్ల నివాసితులు అందరూ బయటకు వెళ్లిపోయారు. దీంతో అందరూ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. మంటలంటుకున్న ఆ ప్లాట్ మొత్తం పూర్తిగా దగ్ధమైంది. దగ్ధమైన ఆ ప్లాట్‌లో రూ.50 లక్షల విలువైన నగదు, సామగ్రి కాలి బూడిదైందని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు.
Hyderabad: ఈ లోగా స్థానికులు ఇచ్చిన సమాచారంతో మంటలను ఆర్పేందుకు ఫైరింజన్ చేరుకున్నది. కానీ, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం ఉండటంతో ఫైరింజన్ లోపలికి వెళ్లడానికి దారిలేక సిబ్బంది చేతులెత్తేశారు. సమయానికే ఫైరింజన్ వచ్చినా లోనికి వెళ్లడానికి దారిలేక ఫలితం లేకపోయింది. మూడు ఫైరింజన్లు వచ్చి దూరం నుంచి నీటితో మంటలు వ్యాపించకుండా సిబ్బంది చొరవ తీసుకున్నారు. దీంతో అపార్ట్‌మెంట్ బిల్డర్‌పై అక్కడికొచ్చిన పోలీసులు సీరియస్ అయ్యారు.
Hyderabad: ఈ ఘటనతో హైదరాబాద్ నగరంలో వందలాదిగా ఉన్న అపార్ట్‌మెంట్ వాసుల్లో భయాందోళన నెలకొన్నది. ఏదైనా జరగరానికి ఘటన చోటుచేసుకుంటే తమ పరిస్థితి ఏమిటన్న ఆందోళన వారిలో నెలకొన్నది. కొందరు బిల్డర్లు స్వలాభం కోసం అడ్డదిడ్డంగా నిర్మాణాలు చేపట్టడం.. నివాసితులకు ప్రాణసంకటంగా మారింది.