Crime News: సంగారెడ్డి జిల్లాలో ఓ నిండు వివాహిత వింత ఫోబియాతో బాధపడుతూ ఆత్మహత్యకు పాల్పడిన హృదయవిదారక ఘటన వెలుగులోకి వచ్చింది. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శర్వా హోమ్స్‌లో నివసించే మనీషా (25), గత కొంతకాలంగా చీమలంటే తీవ్ర భయం (మైర్మెకోఫోబియా)తో బాధపడుతోంది.
చికిత్స చేసినా దక్కని ఉపశమనం
శ్రీకాంత్, మనీషా అనే దంపతులు తమ మూడేళ్ల కుమార్తె అన్వికాతో కలిసి అమీన్‌పూర్‌లోని శర్వా హోమ్స్‌లో నివసిస్తున్నారు. మనీషా ‘మైర్మెకోఫోబియా’ (చీమలంటే తీవ్ర భయం)తో బాధపడుతుండేది. ఈ సమస్యను పరిష్కరించడానికి కుటుంబ సభ్యులు ఆమెను ఎన్నో ఆసుపత్రులకు తీసుకెళ్లారు. చాలా చోట్ల చికిత్సలు, కౌన్సిలింగ్‌లు ఇప్పించినా ఎలాంటి ఫలితం లేకపోయింది.
ఇది కూడా చదవండి: Coimbatore Gang Rape: డీఎంకే మిత్రపక్ష నేత వివాదాస్పద వ్యాఖ్యలు.. గ్యాంగ్ రేప్ బాధితురాలిపై నిందలు
తీవ్ర మనస్తాపానికి గురైన మనీషా, మంగళవారం (నవంబర్ 4న) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సాయంత్రం విధుల నుంచి ఇంటికి వచ్చిన భర్త శ్రీకాంత్, బెడ్రూమ్ తలుపు లోపలి నుంచి గడియపెట్టి ఉండటం గమనించి స్థానికుల సహాయంతో డోర్‌ను బద్దలు కొట్టాడు. లోపల విగతజీవిగా ఉన్న భార్యను చూసి కన్నీరుమున్నీరయ్యాడు.
హృదయవిదారక సూసైడ్ నోట్
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. బెడ్రూమ్ పక్కన లభించిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు.
“శ్రీ… ఐయామ్ సారీ.. ఈ చీమలతో బతకడం నావల్ల కావట్లేదు. అన్విని జాగ్రత్తగా చూసుకో.. అన్నవరం, తిరుపతి, ఎల్లమ్మ మొక్కులను తీర్చండి” అని మనీషా లేఖలో రాసింది. (తిరుపతి హుండీలో రూ. 1116 వేయాలని, ఎల్లమ్మకు బియ్యం పోయాలని కూడా ఆమె రాసినట్లు సమాచారం).
పోలీసులు సూసైడ్ నోట్ ఆధారంగా చీమల ఫోబియా కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్టు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

