Maoist: మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాల నడుమ ఆ పార్టీకి పెద్ద దెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఉధృతమైన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు వికల్ప్ కూడా ఉన్నాడనే సమాచారం లభిస్తోంది.
అబూజ్మాడ్ అటవీ ప్రాంతంలో ఆపరేషన్
నారాయణపూర్ జిల్లాలోని అబూజ్మాడ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు దాగి ఉన్నారన్న ఇంటెలిజెన్స్ ఆధారంగా భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ క్రమంలో ఎన్కౌంటర్ చోటుచేసుకుని ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. వారిలో ఒకరు కీలక నేత వికల్ప్ కావచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
బస్తర్ ఐజీ ధృవీకరణ
ఘటనపై బస్తర్ ఐజీ సుందర్ రాజ్ స్పందిస్తూ ఘటనాస్థలంలో ఒక ఏకే-47 రైఫిల్, మరికొన్ని ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని, ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతుందని,పూర్తయ్యాక మరిన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
మావోయిస్టు వర్గాల్లో కలకలం
ఆవిర్భావ వారోత్సవాల మధ్యే కీలక నేత వికల్ప్ హతమయ్యాడన్న వార్త మావోయిస్టు వర్గాల్లో కలకలం రేపుతోంది. భద్రతా బలగాల దాడులు మరింత ముమ్మరమయ్యే అవకాశం ఉందని సమాచారం.