Telangana: తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ పాలనపై మావోయిస్టు పార్టీ సంచలన బహిరంగ లేఖను గురువారం విడుదల చేసింది. మావోయిస్టు పార్టీ అదికార ప్రతినిధి జగన్ పేరిట ఉన్న ఈ లేఖలో పలు కీలక విషయాలను పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చి హామీల అమలును తుంగలో తొక్కిందని, కార్పొరేట్ల మేలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని మావోయిస్టు పార్టీ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
Telangana: పౌరుల ప్రాథమిక హక్కులను ఈ ప్రభుత్వం కాలరాస్తున్నదని మావోయిస్టు పార్టీ ఆలేఖలో పేర్కొన్నది. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచీకరణ చేసేందుకే మూసీ సుందరికరణ, హైడ్రా పేరిట కూల్చివేతలు చేపట్టి బుల్డోజర్ పాలనను కొనసాగిస్తుందని ధ్వజమెత్తింది. మూసీ పరిసరాల్లో నివసించే ప్రజలకు కనీస తాగునీటి అవసరాలు తీర్చని ప్రభుత్వం.. సుందరీకరణ పేరిట పర్యాటకం కోసం దేశ, విదేశీ పెట్టుబడిదారులను ఆహ్వానిస్తుందని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. మూసీలోకి చేరుతున్న పరిశ్రమ వ్యర్థజలాలు, మురగునీటిని పరిశుభ్రం చేయకుండా, ఇండ్లు కూలగొట్టి.. ప్రజలను బాధితులుగా చేయజూస్తున్నదని విమర్శించింది.
Telangana: హైదరాబాద్‌లో అక్రమంగా నిర్మించుకున్న బడా బాబులను వదిలేసిన కాంగ్రెస్ సర్కారు.. పేద, మధ్య తరగతి వర్గాలు అన్ని అనుమతులతో కట్టుకున్న నివాసాలను కూల్చడం దుర్మార్గ చర్య అని మావోయిస్టు పార్టీ పేర్కొన్నది. వికారాబాద్ జిల్లాలో దామగుండం నేవీ ర్యాడార్ కేంద్రం ఏర్పాటుతో సహజ సిద్ధమైన అటవీ ప్రాంతాన్ని, ప్రజలను, జంతుజాలాలను ప్రమాదకర స్థితికి తీసుకెళ్లుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.
Telangana: లగచర్ల ఘటనపైనా మావోయిస్టు పార్టీ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. లగచర్లలో ఫార్మాసిటీని నిర్మించేందుకు రైతుల భూములను కొల్లగొట్టేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నతుందని, దీనికి నిరసనగానే రైతులు మిలిటెంట్ ఉద్యమం చేపట్టారని మావోయిస్టు పార్టీ పేర్కొన్నది. ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమిస్తున్నారని తెలిపారు.
Telangana: రాష్ట్రంలో విధ్వంస, అప్రజాస్వామిక పాలన కొనసాగుతుందని హెచ్చరించింది. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల, ప్రజా వ్యతిరేక పాశవిక పాలనను ఖండించాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. హైడ్రా, మూసీ కూల్చివేతల బుల్డోజర్ చర్యలను ప్రతిఘటించాలని కోరింది. నేవీ ర్యాడార్, ఫార్మా సిటీకి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు కొనసాగాలని ఆ పార్టీ ఆకాంక్షించింది.