Jaya Janaki Nayaka:

New Record: బోయపాటి ఊర మాస్.. దెబ్బకి యూట్యూబ్‌లో 1 బిలియన్ వ్యూస్

Jaya Janaki Nayaka: బోయపాటి శ్రీను అంటే ఊరమాస్ యాక్షన్‌కు మరో పేరు. మాస్ ప్రేక్షకుల పల్స్‌ను అద్భుతంగా పట్టుకునే దర్శకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఫ్యామిలీ ఎమోషన్స్, పవర్‌ఫుల్ యాక్షన్, హీరో ఎలివేషన్స్‌ను తనదైన శైలిలో మిళితం చేస్తూ వరుస విజయాలు అందుకున్నారు బోయపాటి. ఆయన సినిమాలు గమనించినట్లయితే ఎందరో ఆర్టిస్టులు ఉంటారు. ఇలా చాలా మంది ఆర్టిస్టులకు లైఫ్ ఇస్తున్న డైరెక్టర్ గా బోయపాటికి మంచి పేరుంది. భద్ర, సింహ, లెజెండ్, సరైనోడు, అఖండ వంటి మాస్ బ్లాక్‌బస్టర్లతో ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్న బోయపాటి.. ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలోనూ తన ముద్రను మరింత బలంగా వేసుకున్నారు. ఒక తెలుగు దర్శకుడి సినిమా ప్రపంచ స్థాయిలో ఇలాంటి రికార్డు నమోదు చేయడం అభిమానులను ఆనందంలో ముంచెత్తుతుండగా, బోయపాటి కెరీర్‌లో ఇది మరో ప్రతిష్ఠాత్మక మైలురాయిగా నిలిచిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈరోజుల్లో ఒక సినిమా భారీ వసూళ్లు సాధించడం పెద్ద విషయమేమి కాదు. చాలా మంది డైరెక్టర్ల సినిమాలు వసూళ్ల వర్షం కురిపిస్తాయి. కానీ డిజిటల్ వేదికపైనా తన సత్తా చాటుకున్న డైరెక్టర్ మాత్రం ముమ్మాటికీ బోయపాటి అనే చెప్పాలి.

బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ‘జయ జానకి నాయక’ హిందీ డబ్బింగ్ వెర్షన్ ‘ఖూంఖార్’ యూట్యూబ్‌లో ఏకంగా 1 బిలియన్ వ్యూస్ దాటడం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 2019లో యూ ట్యూబ్ లో విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈ అరుదైన మైలురాయిని అందుకున్న తొలి సినిమాగా నిలిచి కొత్త చరిత్ర సృష్టించింది. డిజిటల్‌లో ప్రేక్షకులు చూపించిన ఆదరణతో ఈ సినిమా, ఏ సినిమా సాధించని సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది.ఈ అరుదైన ఘనతపై స్పందించిన బోయపాటి శ్రీను అభిమానులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇది కేవలం వ్యూస్ సంఖ్య మాత్రమే కాదని, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు తన సినిమాపై చూపించిన ప్రేమకు ప్రతీక అని పేర్కొన్నారు. ఇలా బోయపాటి అఖండమైన రికార్డులతో దూసుకుపోతూ తన స్థానాన్ని ప్రత్యేకంగా నిలబెట్టుకొని, అభిమానుల్లో తనకంటూ ఒక సపరేట్ బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *