Nara Lokesh: 

Nara Lokesh: ఏపీకి మరో అంతర్జాతీయ మెగా ప్రాజెక్ట్? దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్‌ కీలక భేటీ..!

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ ఎలక్ట్రానిక్స్ మరియు డిస్‌ప్లే తయారీ రంగంలో అగ్రగామిగా నిలబెట్టేందుకు కూటమి ప్రభుత్వం వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్‌.. సియోల్ వేదికగా ప్రముఖ సెమీకండక్టర్ మెటీరియల్స్ దిగ్గజం ‘సాఫ్ట్-ఈపీఐ’ (Soft-Epi) ప్రతినిధులతో అత్యంత కీలకమైన చర్చలు జరిపారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ రంగాన్ని సరికొత్త ఎత్తుకు తీసుకెళ్లే లక్ష్యంతో, ఏపీలో మైక్రో ఎల్ఈడీ డిస్‌ప్లే మెటీరియల్ హబ్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా ఆ సంస్థకు మంత్రి అధికారికంగా ఆహ్వానం పలికారు.

ఈ భేటీలో సాఫ్ట్-ఈపీఐ సీఈవో సుంగ్ మిన్ హ్వాంగ్, సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ ఇన్-సుంగ్ చోలతో మంత్రి లోకేశ్‌ సుదీర్ఘంగా మాట్లాడారు. భారతదేశంలో డిస్‌ప్లే మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి ఆంధ్రప్రదేశ్ ఎలా కేరాఫ్ అడ్రస్‌గా మారబోతోందో ఈ సందర్భంగా ఆయన పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. దేశీయ మార్కెట్లోని ఇతర సంస్థలతో కొలాబరేట్ అవుతూ, డిస్‌ప్లే తయారీదారుల కోసం ఏపీలో ఒక ప్రత్యేకమైన మైక్రో ఎల్ఈడీ డిస్‌ప్లే మెటీరియల్ హబ్‌ను నెలకొల్పాలని కోరారు. ఈ మెగా హబ్ ద్వారా రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ ఈకోసిస్టమ్ ఊహించని రీతిలో బలోపేతం అవుతుందని లోకేశ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

పరిశ్రమల స్థాపనతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా నైపుణ్యాభివృద్ధి (Skill Development) పై మంత్రి లోకేశ్‌ ప్రత్యేక ప్రతిపాదనలను సంస్థ ముందు ఉంచారు. తిరుపతి ఐఐటీ (IIT Tirupati) భాగస్వామ్యంతో రాష్ట్రంలో ఒక అడ్వాన్స్‌డ్ ఎపిటాక్సీ సెంటర్‌ను నిర్మించాలని సూచించారు. దీనితో పాటు, ఏపీ ప్రభుత్వంతో కలిసి ‘సాఫ్ట్-ఈపీఐ అకాడమీ’ని ప్రారంభించి, GaN ఎపిటాక్సీ, ఎంఓసీవీడీ, మైక్రో ఎల్ఈడీ వంటి రేపటి తరం అత్యాధునిక సాంకేతికతలపై ప్రతి సంవత్సరం 500 మంది స్థానిక టెక్నీషియన్లకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ ఇవ్వాలని కోరారు.

మంత్రి లోకేశ్‌ తీసుకొచ్చిన వినూత్న ప్రతిపాదనలపై సాఫ్ట్-ఈపీఐ సీఈవో సుంగ్ మిన్ హ్వాంగ్ సానుకూలంగా స్పందించారు. దక్షిణ కొరియా కేంద్రంగా పనిచేస్తున్న తమ సంస్థ GaN ఎపివేఫర్లు, మైక్రో-ఎల్ఈడీ ఉత్పత్తులను గ్లోబల్ మార్కెట్‌కు సరఫరా చేస్తోందని చెప్పారు. ప్రస్తుతం భారతదేశంలో తమకు నేరుగా ఎలాంటి తయారీ ప్లాంట్లు లేవని చెబుతూనే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించబోయే రాయితీలు, ఆకర్షణీయమైన పారిశ్రామిక విధానాలను తాము క్షుణ్ణంగా పరిశీలిస్తామని, త్వరలోనే ఏపీలో పెట్టుబడులు, అకాడమీ స్థాపనపై ఒక సానుకూల నిర్ణయాన్ని ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ చారిత్రాత్మక భేటీతో ఏపీకి మరో అంతర్జాతీయ మెగా ఎలక్ట్రానిక్స్ ప్రాజెక్టు వచ్చేందుకు మార్గం సుగమమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *