Maoist Bharat Bandh: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ను నిరసిస్తూ మావోయిస్ట్ పార్టీ శుక్రవారం (నేడు) భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాలతో పాటు భద్రాద్రి కొత్తగూడెం ఏజెన్సీలో భద్రతా బలగాలు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యాయి. మావోయిస్ట్ పార్టీ కేంద్ర అధికార ప్రతినిధి అభయ్ పేరుతో విడుదలైన లేఖలో ఈ బంద్‌కు పిలుపునిచ్చారు. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా కేంద్రం అమలు చేస్తున్న ‘ఆపరేషన్ కగార్’ను తక్షణమే నిలిపివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
సరిహద్దుల్లో హైఅలర్ట్ బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నివారించడానికి తెలంగాణ, ఆంధ్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాలలో హైఅలర్ట్ ప్రకటించారు. పోలీసులు, భద్రతా బలగాలు పెద్ద ఎత్తున మోహరించి, కూంబింగ్ చర్యలను ముమ్మరం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం ఏజెన్సీలోని ఏటూరునాగారం, వాజేడు, వెంకటాపురం, మంగపేట మండలాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
Also Read: Kurnool: కర్నూలు దగ్గర ఘోర అగ్నిప్రమాదం: పూర్తిగా దగ్ధమైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
ప్రతీకార దాడుల భయం ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలైన మల్లోజుల, తక్కెళ్లపల్లిపై ప్రతీకారంతో మావోయిస్టులు మెరుపు దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో, కల్వర్టులు, సెల్ టవర్లు వంటి కీలక ప్రదేశాలలో విధ్వంసాలను అడ్డుకోవడానికి బాంబు స్క్వాడ్‌లతో తనిఖీలు చేపట్టారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ, అనుమానాస్పద వ్యక్తులను ప్రశ్నిస్తున్నారు.
బంద్ కారణంగా సాధారణ ప్రజలు, రవాణా వ్యవస్థపై ప్రభావం పడింది. ఛత్తీస్‌గఢ్ నుంచి రాష్ట్రంలోకి వచ్చే వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అనుమతిస్తున్నారు. ఆర్టీసీ బస్సులు ఏజెన్సీ గ్రామాలకు నైట్ సర్వీసులను నిలిపివేశాయి. ఆంధ్రాలోని చింతూరు నుంచి భద్రాచలం వైపు వెళ్లే మార్గాన్ని మూసివేసి, వాహనాలను కూనవరం మీదుగా మళ్లిస్తున్నారు. అంతేకాక, ఏజెన్సీ ప్రాంతంలోని ప్రజా ప్రతినిధులను కూడా పోలీసులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఆదేశించారు. ప్రతిపక్షాల మద్దతు లేకపోవడం వల్ల బంద్ వాతావరణం కనిపించట్లేదు. స్కూళ్లు, కాలేజీలు, షాపులు యథాతథంగా తెరిచే ఉన్నాయని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని అధికారులు భరోసా ఇస్తున్నారు.

