Superstition: మూఢనమ్మకాలు.. కొంతమందిని పట్టి పీడిస్తాయి. మూఢనమ్మకాలకు లొంగిపోయినవారు వారితో పాటు.. పక్కవారి జీవితాలను కూడా నాశనం చేశేస్తారు. మూఢనమ్మకాల నేపథ్యంలో ఒకరిని ఒకరు చంపుకోవడం జరుగుతుంది. ఇదిగో బీహార్ లో ఇలాంటి మూఢనమ్మకానికే ఒక వృద్ధుడు బలైపోయాడు. అతనితో పాటు ఒక బాలుడిని కూడా బలి ఇచ్చారు. ఇదంతా ఎందుకంటే.. తమకు పిల్లలు కావాలనే కోరికతో అని చెబుతున్నారు ఆ ప్రబుద్ధులు. తమకు పిల్లలు కావాలని వేరొకరికి పుత్రశోకం కలిగించడం ఎంత దారుణమైన విషయమో కదా. ఈ సంఘటన బీహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాలోని మదన్‌పూర్ గ్రామానికి ఆనుకుని ఉన్న గులాబ్ బికా అనే గ్రామంలో జరిగింది.
ఈనెల 13 నుంచి అక్కడ 65 ఏళ్ల యుకుల్ యాదవ్ అనే ఒక వృద్ధుడు కనిపించకుండా పోయాడు. అతని కుటుంబసభ్యులు అతని కోసం వేడుకులాడినా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో అక్కడి దగ్గర్లోనే వున్న బంగర్ అనే గ్రామంలో ఒక వృద్ధుడి మృతదేహం కాలిపోయి ఉందని సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అక్కడి దృశ్యం వారిని దిగ్భ్రాంతికి గురిచేసింది. అక్కడ తల లేని ఒక వృద్ధుడి మృతదేహం కాలిపోయి ఉంది. ఆ ప్రదేశంలో నిప్పులు రాజేసి పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి. దీంతో దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఇది కూడా చదవండి: Nara Lokesh: లోకేష్ మాస్ స్పీచ్
ఈ క్రమంలో అక్కడ పూజలు నిర్వహించిన సునీల్ పాస్వాన్, అతని సహచరుడు ధర్మేంద్ర, ఒక బాలుడు సహా నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిని తమదైన స్టైల్ లో విచారించగా ఆ వృద్ధుడిని నరబలి ఇచ్చినట్టు వారు అంగీకరించారు. అంతేకాదు.. ఇంకో షాకింగ్ విషయమూ వాళ్ళు చెప్పారు. అంతకు కొన్నిరోజుల ముందు తాము ఒక బాలుడిని కూడా నరబలి ఇచ్చి తరువాత దగ్గరలోని చెరువులో పారేసినట్టు చెప్పారు. దీంతో పోలీసులకు మతి పోయింది. సునీల్ పాశ్వాన్ కు పిల్లలు లేకపోవడంతో ఇలా నరబలి ఇస్తే పిల్లలు పుడతారని ఇక్లా చేసినట్టు వారు వెల్లడించారు.
దీని తరువాత, పోలీసులు నరబలి జరిగిన ప్రదేశానికి సమీపంలోని పొలం నుండి యుకుల్ తలను స్వాధీనం చేసుకున్నారు. పూజ చేసిన మాంత్రికుడు రామశిష్ రక్షయన్ కోసం వెతుకుతున్నారు. నరబలికి ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకుని, కాలిన ఎముకల నమూనాలను పరీక్ష కోసం పంపించారు. ప్రస్తుతం ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.