Viral News: అడవిలో కారులో కొందరు కుర్రాళ్ళు హుషారుగా వచ్చేస్తున్నారు. ఇంతలో ఒక అడవి ఏనుగు రోడ్డుమీద నిలబడి కనిపించింది. దీంతో కారు ఆపారు. అయితే, ఆ కుర్రాళ్లలోని ఒకడు ఏనుగు దగ్గరకు వెళ్లి ఫోటోలు.. వీడియోలు తీసి హంగామా చేశాడు. పాపం ఆ ఏనుగు కూడా ఏదోలే సరదా పడుతున్నాడులే అన్నట్టుంది. అంత దగ్గరగా వెళ్లి ఫోటోలు తీస్తున్నా ఏమీ అనకుండా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఫోటోలు.. వీడియోలు తీసిన కుర్రాడు ఊరికినే ఉండడు కదా.. వాటిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. అవి చాలామంది చూశారు. లైకులు కొట్టారు. కట్ చేస్తే..
తమిళనాడు బందీపూర్లో అడవి ఏనుగు దగ్గర ఫోటోలు తీసుకున్నందుకు అటవీ అధికారులు ఒక పర్యాటకుడికి రూ.25,000 జరిమానా విధించారు. హమీద్ సామ్రాజ్ నగర్ జిల్లా కుందులుపేటకు చెందినవాడు. కొన్ని రోజుల క్రితం, అతను స్నేహితులతో కలిసి కారులో ఊటీకి వెళ్ళాడు. అక్కడ ట్రిప్ ఎంజాయ్ చేసి తిరిగి తమ ఊరికి బయలుదేరిన వారు గుండులుపేట-ఊటీ రోడ్డుపై వస్తున్నారు.
ఆ సమయంలో, బండిపూర్లో ఒక అడవి ఏనుగు ఆహారం కోసం రోడ్డుపై నిలబడి ఉంది. ఇది చూసిన స్నేహితులు వాహనాన్ని ఆపారు. హమీద్ మాత్రమే కారు దిగి, ఏనుగు దగ్గరికి వెళ్లి, అరిచాడు. కొద్దిసేపు హంగామా చేశాడు. అలాగే అతను దీన్ని వీడియోగా సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. వీడియో రీచ్ బాగా వచ్చింది. అయితే, కొంతమంది వన్యప్రాణి ప్రేమికులు ఈ వీడియో తీసినందుకు ఆ యువకుడికి వ్యతిరేకంగా కామెంట్స్ పెట్టారు. అంతటితో ఊరుకోకుండా దీనిని అటవీ శాఖ దృష్టికి తీసుకెళ్లారు.
ఇది కూడా చదవండి: Maha Kumbhamela 2025: మహా కుంభమేళా ట్రాఫిక్ జామ్.. 52 మంది కొత్త అధికారులు.. మాఘ పౌర్ణిమ ఏర్పాట్లు షురూ!
ఆ వీడియో చూసిన అటవీ శాఖ అధికారులు మనోడి ఆచూకీ కనిపెట్టి పట్టుకున్నారు. అతనికి 25,000 రూపాయలు జరిమానా విధించారు. అడవిలో స్వేఛ్చగా తిరిగే జంతువుల వద్దకు వెళ్లడం.. వాటిని ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించడం.. వీడియోలు తీయడం.. ప్లాస్టిక్ విసరడం నిషేధం. ఈ నిబంధన ఉల్లంఘించినందుకు అతనికి జరిమానా విధించారు. జరిమానా చెల్లించిన హమీద్.. తరువాత ఈ విషయాన్ని షేర్ చేసుకుంటూ ఒక వీడియో అప్ లోడ్ చేశాడు.
అందులో హమీద్ మాట్లాడుతూ, “బందీపూర్ నేషనల్ పార్క్ లో ఒక ఏనుగు దగ్గర ఫోటోలు, వీడియోలు తీశాను. దానికి నేను 25,000 రూపాయలు జరిమానా చెల్లించాను. “బందీపూర్ అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్ విసిరేయడం, వాహనాలు పార్క్ చేయడం, వీడియోలు తీయడం , ఫోటోలు తీయడం తప్పు.” “నాలాంటి తప్పు ఎవరూ చేయకూడదు” అనిఅందరికీ అవగాహన కలిగేలా చెప్పుకొచ్చాడు.
అదండీ విషయం.. అదేదో సినిమాలో చెప్పినట్టు సింహం పడుకుంది కదా అని దాని మీసం పట్టుకోవాలనుకోవడం చేయకూడదు. ఏనుగు భలే ఉందని ఫోటోలు తీయకూడదు. అలాంటి పనులు చేస్తే ఇదిగో ఇలాగే సరదా తీరిపోతుంది!

