Mallojula Venugopal: మావోయిస్టు ఉద్యమ చరిత్రలో పెద్ద మలుపుగా నిలిచే నిర్ణయం తీసుకున్నారు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్‌రావు అలియాస్ అభయ్. మూడు దశాబ్దాలుగా సాయుధ పోరాటాన్ని నడిపించిన ఆయన తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో అధికారికంగా లొంగిపోయారు.
బుధవారం ఉదయం జరిగిన కార్యక్రమంలో మల్లోజులతో పాటు సుమారు 60 మంది మావోయిస్టులు తమ ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. సీఎం ఫడ్నవీస్ ఈ సందర్భంగా మల్లోజుల బృందాన్ని జన జీవన స్రవంతిలోకి స్వాగతించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాస సాయం అందించనున్నట్లు ప్రకటించింది.
మల్లోజుల వేణుగోపాల్‌పై గతంలో మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో వందకు పైగా కేసులు నమోదయ్యాయి. ఆయనపై ₹6 కోట్ల నుంచి ₹10 కోట్ల వరకు రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆయన లొంగిపోవడంతో భద్రతా బలగాలు పెద్ద ఊపిరి పీల్చుకున్నాయి.
తాజాగా లొంగిపోవడానికి ముందు మల్లోజుల వేణుగోపాల్ పలు బహిరంగ లేఖలు విడుదల చేశారు. మావోయిస్టు పార్టీ లోపాలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, పార్టీ తప్పుడు దిశలో నడుస్తోందని తీవ్ర విమర్శలు చేశారు. దశాబ్దాలుగా జరుగుతున్న తప్పిదాలకు తానే కారణమని పేర్కొంటూ, ఆయన పోలిట్‌బ్యూరో నుంచి రాజీనామా చేశారు.
Also Read: Bihar Polls: ఎన్డీఏలో సీట్ల చిచ్చు.. ఉపేంద్ర కుష్వాహా ఆగ్రహం.. పరిస్థితి సరిగా లేదంటూ ఢిల్లీకి పయనం!
తెలంగాణలోని పెద్దపల్లికి చెందిన మల్లోజుల కుటుంబం స్వాతంత్ర్యానంతర కాలంలో సాయుధ ఉద్యమంలో చురుకుగా పాల్గొంది. ఆయన తండ్రి మల్లోజుల వెంకటయ్య తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించారు. ఆ స్ఫూర్తినే తీసుకొని వేణుగోపాల్ తన అన్న మల్లోజుల కోటేశ్వరరావు (కిషెన్‌జీ) పిలుపుతో మావోయిస్టు ఉద్యమంలో చేరారు. పార్టీ లోపల ఆయనను అభయ్, సోను, భూపతి, వివేక్ పేర్లతో పిలిచేవారు.
మల్లోజుల లొంగిపోవడం మావోయిస్టు పార్టీకే కాకుండా మొత్తం ఎడమ చరిత్రకు ఒక పెద్ద మలుపుగా భావిస్తున్నారు. గత కొన్నేళ్లుగా కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ వంటి చర్యలతో మావోయిస్టు ప్రభావం తగ్గుతూ వస్తోంది. ఇక మల్లోజుల లొంగిపోవడంతో సాయుధ ఉద్యమం మరింత బలహీనపడిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇక ఆయనతో పాటు లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం పునరావాసం కల్పించేందుకు చర్యలు ప్రారంభించింది. శాంతి చర్చలకు తలుపులు తెరిచినట్లు సీఎం ఫడ్నవీస్ ప్రకటించారు. మల్లోజుల నిర్ణయం ఇతర మావోయిస్టు నేతలకు కూడా శాంతి మార్గం చూపే ఉదాహరణగా నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.