Film Industry: మలయాళ సినీ పరిశ్రమను కుదిపేసిన గంజాయి కేసులో ప్రముఖ దర్శకులు ఖలీద్ రెహమాన్, అష్రఫ్ హంజా, సన్నిహితుడు షలీఫ్ మహ్మద్‌లు అరెస్ట్ అయ్యారు. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో, కొచ్చిలోని గోశ్రీ బ్రిడ్జి సమీపంలోని ఫ్లాట్‌లో ఎక్సైజ్ అధికారులు దాడి నిర్వహించారు.
దాడిలో 1.6 గ్రాముల హైబ్రిడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విచారణ అనంతరం ఖలీద్, అష్రఫ్‌కు వైద్య పరీక్షలు నిర్వహించి, అనంతరం బెయిల్‌పై విడుదల చేశారు. అయితే, కేసులో దర్యాప్తును ముమ్మరం చేసినట్టు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది.
ఫ్లాట్ ఎవరిది?
ఈ ఘటన జరిగిన ఫ్లాట్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సమీర్ తాహిర్ అద్దెకు తీసుకున్నదిగా గుర్తించారు. సమాచారం మేరకు, అరెస్టయిన షలీఫ్ మహ్మద్ ఈ దర్శకులకు సన్నిహిత మిత్రుడిగా ఉంటున్నాడు. అధికారుల దర్యాప్తు ప్రకారం, ఈ ముగ్గురు వ్యక్తులు చాలాకాలంగా గంజాయి వినియోగిస్తున్నట్టు అనుమానం.
దర్శకత్వ విభాగంలో ఖలీద్, అష్రఫ్ ప్రస్థానం
ఖలీద్ రెహమాన్ దర్శకత్వం వహించిన ‘అనురాగ కరిక్కిన్ వెల్లం’, ‘ఉండ’, ‘తల్లుమాల’, ‘అలప్పుళ జింఖానా’ వంటి చిత్రాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. అదే విధంగా అష్రఫ్ హంజా ‘తమాషా’, ‘భీమంటే వాజీ’, ‘సులైఖా మంజిల్’ సినిమాలతో గుర్తింపు పొందారు.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: OG బిగ్ బిజినెస్
మరొక వైపు నటులు కూడా దర్యాప్తులో
హైబ్రిడ్ గంజాయి కేసులో మలయాళ నటుడు షైన్ టామ్ చాకో, శ్రీనాథ్ భాసిలకు కూడా నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే డ్రగ్స్ సరఫరా వ్యవహారంలో తస్లీమా సుల్తానా అలియాస్ క్రిస్టినా, కె ఫిరోజ్, సుల్తాన్ అక్బర్ అలీ లను అరెస్ట్ చేసినట్టు సమాచారం.
మాదకద్రవ్యాల కలకలం
ఇప్పటికే మలయాళ పరిశ్రమలో మాదకద్రవ్యాల వాడకం పై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొత్తగా వెలుగులోకి వస్తున్న కేసులతో పరిశ్రమ పరువు మళ్లీ ముద్దడిపోతోందని సినీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.