Hyderabad: ఫార్మా రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు హైదరాబాద్ నగరం అనువైన స్థలం అని ప్రముఖ ఫార్మా కంపెనీ యాజమాన్యులు భావించారు. ఈ మేరకు తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు. ప్రభుత్వంతో కీలక ఎంవోయూలు చేసుకున్నారు. హైదరాబాద్ ఫార్మాసిటీలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలోని ఐదు దిగ్గజ ఫార్మా కంపెనీలు ముందుకొచ్చాయి. సీఎం రేవంత్ రెడ్డితో డాక్టర్ రెడ్డీస్, అరబిందో, హెటిరో, ఎంఎస్‌ఎన్, లారస్ కంపెనీల యాజమాన్యులు భేటీ అయ్యారు.
గ్రీన్ ఫార్మాసిటీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు.ఆరు కంపెనీలు కలిసి దాదాపు రూ.5,260 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నాయి. ఫార్మా కంపెనీల ప్రతినిధులు తమ పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన ఎంవోయూలపై సంతకాలు చేశారు. వీటి ద్వారా ఫార్మా రంగంలో 12,490 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఇప్పటికే ప్రభుత్వం గుర్తించిన ఫార్మా సిటీలో వీటికి అవసరమైన యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం స్థలాన్ని కేటాయించనుంది.
ఎంవోయూల ఒప్పందాల ప్రకారం డాక్టర్ రెడ్డీస్ లాబ్స్ ఇంజెక్టబుల్, బయో సిమిలర్ల యూనిట్ ఏర్పాటు చేస్తుంది. హెటిరో ల్యాబ్స్ ఫినిషిడ్ డోస్, ఇంజక్టబుల్ తయారీ పరిశ్రమ నెలకొల్పనుంది. ఎంఎస్ఎన్ లాబోరేటరీ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ తో పాటు ఆర్ అండ్ డీ సెంటర్ నెలకొల్పనుంది. లారస్ ల్యాబ్స్, అరబిందో ఫార్మా ఫార్ములేషన్ యూనిట్లు నెలకొల్పుతాయి. గ్లాండ్ పార్మా ఆర్ అండ్ డీ సెంటర్, ఇంజెక్టబుల్స్, డ్రగ్ సబ్స్టన్స్ మాన్యుఫాక్చర్ యూనిట్లను స్థాపించనుంది. మరో నాలుగు నెలల్లో ఫార్మా కంపెనీలు తమ నిర్మాణ పనులు చేపట్టేందుకు వీలుగా స్థలాలను కేటాయించటంతో పాటు, ఫార్మా సిటీలో అవసరమైన సదుపాయాలు కల్పించాలని ముఖ్యమంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు.