Heavy Rains: గడిచిన కొన్ని రోజులుగా విపరీతమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోతున్న భాగ్యనగర వాసులకు వరుణుడు అదిరిపోయే ఉపశమనం కలిగించాడు. చాలారోజుల తర్వాత హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమై చల్లటి గాలులతో పాటు వర్షం మొదలవడంతో తీవ్రమైన వేడి నుంచి నగర ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొని భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో నగరవాసులు తాగునీరు, ఎండల తీవ్రతతో సతమతమవుతున్న వేళ ఈ వర్షం కాస్త ఊరటనిచ్చింది.
ఐటీ కారిడార్‌తో పాటు నగరంలోని ప్రధాన ప్రాంతాలన్నింటిలోనూ వర్షం జోరుగా సాగింది. ఫిలింనగర్, జూబ్లీహిల్స్, జూబ్లీ చెక్‌పోస్ట్, మాదాపూర్, రాయదుర్గం, మణికొండ, షేక్‌పేట్ పరిసరాల్లో రహదారులు తడిసిముద్దయ్యాయి. అటు తూర్పు నగర ప్రాంతాలైన ఉప్పల్, మేడిపల్లి, పీర్జాదిగూడ, బోడుప్పల్, ఘట్‌కేసర్, పోచారం ప్రాంతాల్లోనూ జోరువాన పడింది. అలాగే కాప్రా, కీసర, నాగారం, తుర్కయంజాల్, మన్నెగూడ, రాగన్నగూడతో పాటు టోలిచౌకి, లంగర్‌హౌస్, కార్వాన్, రాజేంద్రనగర్, యూసుఫ్‌గూడ, ఎస్.ఆర్.నగర్, అమీర్‌పేట్ పరిధిలోనూ వర్షం కురవడంతో నగర వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. కొన్నిచోట్ల రోడ్లపై వర్షపు నీరు చేరి ట్రాఫిక్ నెమ్మదించినప్పటికీ, తీవ్రమైన ఎండల నుంచి ఉపశమనం లభించడంతో జనాలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
