Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జన్మభూమి, నీరు-మీరు, శ్రమదానం, విజన్ 2020 కార్యక్రమాలు నిర్వహించి పాలనలో ప్రత్యేకతను చాటుకున్నారు. ఆయా కార్యక్రమాలు ఆనాడు విజయవంతంగా కొనసాగాయి. ఇప్పటికీ ప్రజల నోళ్లలో నానుతున్నాయి. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి నాటి నుంచి తన పాలనా పటిమను ప్రదర్శిస్తూ పాలనను పరుగు పెట్టిస్తున్నారు.
Chandrababu Naidu: ఈ నేపథ్యంలోనే మరో వినూత్న కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న మన్‌కీ బాత్ కార్యక్రమం తరహాలో ఓ కార్యక్రమం చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మదిలో మెదిలింది. అనుకున్నదే తడవుగా ఆ కార్యక్రమం అమలుపై అధికారులతో చర్చలు జరుపుతున్నారని సమాచారం. రాష్ట్ర ప్రజలతో ఆయన నేరుగా మాట్లాడేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారని తెలిసింది.
Chandrababu Naidu: ఈ మేరకు ఏపీలో మీతో మీ చంద్రబాబు.. అనే పేరిట ఆ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టనున్నారని తెలిసింది. ఆడియో, వీడియో విధానంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టే అవకాశం ఉన్నది. వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి పర్వదినం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. దీని ద్వారా నిత్యం ప్రజలతో ఉంటూ ప్రజాభిప్రాయాలకు అనుగుణంగా పాలన సాగించాలనేది చంద్రబాబు నాయుడి ఆలోచనగా తెలుస్తున్నది.