Fire Accident: సనత్‌నగర్‌లోని జింకలవాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గురువారంతెల్లవారుజామున 3:30 గంటల సమయంలో జింకలవాడలో ఉన్న డ్యూరోడైన్ ఇండస్ట్రీస్‌లో మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదంలో ప్యాకింగ్ గోదాంలో నిల్వ చేసిన ప్లాస్టిక్ ప్లేట్లు, డిన్నర్ సెట్‌లు వంటి ప్లాస్టిక్ వస్తువులు ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆరు ఫైరింజన్లు, ఒక రోబో సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. అదృష్టవశాత్తు, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే, పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై పూర్తి విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: Punjab: కూలీకి కలిసొచ్చిన అదృష్టం.. రూ.6 పెట్టి టికెట్ కొంటే రాత్రికి రాత్రే కోటీశ్వరుడు
ఇక నిన్న హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్ట ప్రాంతంలో ఒక చిప్స్ పరిశ్రమ గోదాంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. అయితే, షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. గోదాంలో నిల్వ చేసిన చిప్స్ సరుకు మొత్తం కాలిపోయింది. ప్లాస్టిక్, ఫైబర్ మరియు ఇతర మండే పదార్థాలు ఉండటం వల్ల మంటలు వేగంగా వ్యాపించాయి. అదృష్టవశాత్తు, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కంపెనీలో ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ అగ్నిప్రమాదం కారణంగా దట్టమైన పొగలు పరిసర ప్రాంతాలను కమ్మేయడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నివాస ప్రాంతాల మధ్య ఇలాంటి పరిశ్రమలు, గోదాములు ఉండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.