Fire Accident: పంజాబ్‌లో ఒక పెద్ద రైలు ప్రమాదం త్రుటిలో తప్పింది. అమృత్‌సర్ నుంచి సహర్సా వైపు వెళ్తున్న గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ రైలులో శనివారం ఉదయం భారీగా మంటలు చెలరేగాయి.
అసలేం జరిగింది?
శనివారం ఉదయం సుమారు 7:30 గంటల సమయంలో అమృత్‌సర్ నుంచి వస్తున్న ఈ గరీబ్‌రథ్ రైలు (12204) పంజాబ్‌లోని సిర్‌హింద్ స్టేషన్ దగ్గరకి రాగానే, రైలులోని ఓ ఏసీ బోగీ (G-19) నుంచి పొగ, మంటలు కనిపించాయి.
వెంటనే రైలులో ఉన్న ఒక ప్రయాణికుడు ప్రమాదాన్ని గుర్తించి చైన్ లాగి రైలును ఆపేశాడు. దాంతో అధికారులు వెంటనే అప్రమత్తమై, మంటలు అంటుకున్న బోగీలోని ప్రయాణికులను వేరే బోగీల్లోకి సురక్షితంగా మార్చారు.
మూడు బోగీలు దగ్ధం
మంటలు చాలా వేగంగా (G-19) బోగీతో పాటు మరో రెండు బోగీలకు కూడా వ్యాపించాయి. దీంతో రైల్వే అధికారులు వెంటనే స్పందించి, ఆ మూడు బోగీలను రైలు నుంచి విడదీశారు. అగ్నిమాపక దళాలు (ఫైర్ ఇంజన్లు) వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. ఈ ప్రమాదంలో మూడు కోచ్‌లు పూర్తిగా దెగ్ధమయ్యాయి.
ఈ ఘటనలో ఒక 32 ఏళ్ల మహిళకు స్వల్పంగా గాయాలయ్యాయి. ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికులు అందరూ క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు.
ప్రమాదానికి కారణం ఏంటి?
మంటలు ఎలా చెలరేగాయన్న విషయం ఇంకా పూర్తిగా తెలియరాలేదు. దీనిపై దర్యాప్తు జరుగుతోందని అధికారులు చెప్పారు. ప్రయాణికులు మరియు రైల్వే సిబ్బంది సకాలంలో స్పందించడం వలన ఒక పెద్ద ప్రమాదం తప్పిందని రైల్వే అధికారులు తెలిపారు. కాసేపటి తర్వాత మిగిలిన బోగీలను కొత్త ఇంజిన్‌కు తగిలించి రైలును యథావిధిగా ముందుకు పంపించారు.