Pochampally: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోరం జరిగింది. కారు అదుపు తప్పి చెరువు లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో.ఐదుగురు స్పాట్ డెడ్ అయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. భూదాన్ పోచంపల్లి మండలంలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున పోచంపల్లి మండలంలోని జలాల్పూర్ చెరువులోకి ఓ కారు దూసుకెళ్లింది. దీంతో ఐదుగురు యువకులు జలసమాధి అయ్యారు. మరొకరు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికి తీశారు. మృతులను వంశీగౌడ్, దినేశ్, హర్ష, బాలు, వినయ్గౌడ్గా గుర్తించారు.
వారంతా 22 నుంచి 25 ఏండ్ల మధ్య వయస్కులేనని వెల్లడించారు. ప్రమాద సమయంలో కారులో ఆరుగురు ఉన్నారని తెలిపారు. మణికంఠ అనే యువకుడు క్షేమంగా ఉన్నాడని పేర్కొన్నారు.వారంతా హైదరాబాద్ హయత్నగర్ ఆర్టీసీ కాలనీకి చెందినవారని తెలిపారు. ఎల్బీనగర్ నుంచి పోచంపల్లి వెళ్తుండగా జలాల్పూర్ వద్ద ప్రమాదకరంగా ఉన్న మూలమలుపు వద్ద అదుపుతప్పిన కారు చెరువులోకి దూసుకెళ్లిందన్నారు. మృతదేహాలను భువనగిరి దవాఖానకు తరలించారు. వంశి డ్రైవింగ్ చేస్తున్నాడని, ఉదయం 4.30 గంటలకు ప్రమాదం జరిగిందని మణికంఠ వెల్లడించారు. ప్రమాద సమయంలో కారు వేగంగా ఉందని, కారు రెండు పల్టీలు కొట్టి చెరువులో పడిందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.