Narendra Pawar

Narendra Pawar: మాజీ ఎమ్మెల్యేపై గ్యాంగ్ రేప్ కేసు.. పార్టీ పదవులకు రాజీనామా..!

Narendra Pawar: మహారాష్ట్రలోని కళ్యాణ్-భివండి ప్రాంతంలో అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. భర్తతో ఉన్న కుటుంబ సమస్యలను పరిష్కరిస్తామని నమ్మించి, 22 ఏళ్ల వివాహితపై తుపాకీతో బెదిరించి బలవంతంగా మద్యం తాగించి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఆరోపణలపై బీజేపీ మాజీ ఎమ్మెల్యే నరేంద్ర పవార్, ఉద్యోగం నుంచి బర్తరఫ్ అయిన మాజీ పోలీస్ కానిస్టేబుల్ శైలేష్ పాటిల్‌పై పద్ఘా పోలీస్ స్టేషన్‌లో గ్యాంగ్ రేప్ కేసు నమోదైంది. ఈ తీవ్ర ఆరోపణలు, ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో నరేంద్ర పవార్ తన పార్టీ పదవులన్నింటికీ హుటాహుటిన రాజీనామా చేశారు.

సహాయం చేస్తామని ఫామ్‌హౌస్‌కు పిలిపించి దారుణం..

బాధిత వివాహిత తెలిపిన వివరాల ప్రకారం.. తన భర్తతో ఉన్న వివాదంలో సహాయం కోరేందుకు ఆమె మాజీ ఎమ్మెల్యే నరేంద్ర పవార్‌ను ఆశ్రయించింది. సెప్టెంబర్ 13న పంచాయితీ చేసి సమస్యను పరిష్కరిస్తానని చెప్పి పవార్ ఆమెను కళ్యాణ్‌లోని తన కార్యాలయానికి పిలిపించుకున్నాడు.
అక్కడి నుంచి నరేంద్ర పవార్, శైలేష్ పాటిల్ కలిసి ఆమెను భివండి తాలూకా బాప్‌గావ్‌లో ఉన్న ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లారు. అక్కడ శైలేష్ పాటిల్ తుపాకీతో బెదిరించి ఆమెతో బలవంతంగా మద్యం తాగించాడు.
మొదట నరేంద్ర పవార్ ఆమెపై లైంగిక దాడి చేసి అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో అక్కడి నుంచి వెళ్లిపోగా.. ఆ తర్వాత శైలేష్ పాటిల్ కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో పాటిల్ కేర్‌టేకర్ బాధితురాలిని ఆమె ఇంటి వద్ద వదిలిపెట్టి వెళ్లాడు.
కాంగ్రెస్ కార్పొరేటర్‌ను ఆశ్రయించిన మహిళ..
తీవ్ర భయాందోళనకు గురైన బాధితురాలు సెప్టెంబర్ 16న కళ్యాణ్-డొంబివ్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన కాంగ్రెస్ కార్పొరేటర్ కాంచన్ కులకర్ణిని కలిసి తన గోడు వెళ్లబోసుకుంది. తనపై జరిగిన అకృత్యాలకు సంబంధించి తన వద్ద ఉన్న వీడియోలు, వాట్సాప్ చాట్ ఆధారాలను చూపించింది.
కార్పొరేటర్ వెంటనే బాధితురాలిని పద్ఘా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. మహారాష్ట్ర డీజీపీ సదానంద్ డేట్ దృష్టికి ఈ వ్యవహారాన్ని తీసుకెళ్లడంతో.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు ఫిర్యాదును పరిశీలించి నరేంద్ర పవార్, శైలేష్ పాటిల్‌పై సామూహిక అత్యాచారం, ఆయుధాలతో బెదిరింపు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 48 గంటల్లోగా నిందితులను అరెస్ట్ చేయకపోతే మహిళలతో కలిసి పోలీస్ స్టేషన్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కాంచన్ కులకర్ణి హెచ్చరించారు.
పార్టీ పదవులన్నింటికీ నరేంద్ర పవార్ రాజీనామా..
కేసు నమోదు కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించడంతో కళ్యాణ్ వెస్ట్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ ‘భట్కే విముక్త అఘాడీ’ మహారాష్ట్ర రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న నరేంద్ర పవార్ తన అన్ని పదవుల నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు మహారాష్ట్ర బీజేపీ చీఫ్ రవీంద్ర చవాన్‌కు రాజీనామా లేఖ పంపారు.

తనపై నమోదైనవన్నీ నిరాధారమైన, తప్పుడు కేసులని.. తనను రాజకీయంగా బద్నాం చేసేందుకు కొందరు కుట్ర పన్నారని పవార్ తన లేఖలో పేర్కొన్నారు. ఈ వివాదం వల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బతినకూడదనే ఉద్దేశంతోనే రాజీనామా చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ కేసుపై మహారాష్ట్ర పోలీసులు లోతైన దర్యాప్తును ముమ్మరం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *