కాశీ ప్రజలు దేశానికే నాయకుడిని అందించారు..
ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన సజీవ నగరం కాశీ అని, ఇది ప్రధాని మోదీకి కర్మభూమిగా మారిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 2014, 2019, 2024లలో వరుసగా మూడుసార్లు మోదీని ఎంపీగా గెలిపించిన కాశీ ప్రజలు.. కేవలం తమ నియోజకవర్గానికి మాత్రమే కాకుండా యావత్ దేశానికి ఒక గొప్ప నాయకుడిని అందించారని కొనియాడారు.
మోదీ బాల్యం ఎన్నో కష్టాలు, సవాళ్లతో గడిచినప్పటికీ, ఆ ఆటంకాలు ఏవీ ఆయన ఉన్నత ఎదుగుదలను అడ్డుకోలేకపోయాయని, సామాన్య నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి నేడు ప్రపంచస్థాయి నేతగా నిలిచారని అభినందించారు.
సంక్షేమం – 25 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి..
దేశంలో 80 కోట్ల మందికి ఉచిత రేషన్ బియ్యం అందుతోందని, మోదీ పాలనలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని వివరించారు. పీఎం కిసాన్ ద్వారా సుమారు 11 కోట్ల మంది రైతులకు ఎలాంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా వారి ఖాతాల్లోనే నగదు జమ అవుతోందని చెప్పారు. ప్రతి పేదవాడి గడపకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే ప్రధాని సంకల్పమన్నారు.
దేశంలో మహిళలే కేంద్రంగా అభివృద్ధి జరుగుతోందని, ‘బేటీ బచావో – బేటీ పడావో’, ఉజ్వల వంటి పథకాలు మహిళల జీవితాలను మార్చాయన్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే చారిత్రక చట్టాన్ని తీసుకొచ్చిన ఘనత మోదీదేనని ప్రశంసించారు.
కరోనా సంక్షోభంలో 140 కోట్ల మందికి రక్షణ – టెక్నాలజీ విజన్
కరోనా మహమ్మారి సమయంలో ప్రపంచమంతా తీవ్ర భయాందోళనల్లో ఉన్నప్పుడు, మోదీ ముందుండి దేశాన్ని నడిపించారని గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా 140 కోట్ల మందికి రక్షణ కల్పిస్తూ 200 కోట్లకు పైగా కొవిడ్ వ్యాక్సిన్ డోసులను ఉచితంగా అందించడమే కాకుండా, ప్రపంచంలోని 101 దేశాలకు భారత్ తరఫున వ్యాక్సిన్లు పంపి ఆదుకున్నారని కొనియాడారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతను (టెక్నాలజీ) అత్యంత లోతుగా అర్థం చేసుకున్న ఏకైక ప్రధాని నరేంద్ర మోదీ మాత్రమేనని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఆత్మనిర్భర్ భారత్ – రామాలయం కల సాకారం
గతంలో విదేశాల నుంచి ఆయుధాలను దిగుమతి చేసుకున్న భారతదేశం.. ఆత్మనిర్భర్ భారత్ పిలుపుతో నేడు స్వదేశంలోనే ఆయుధాలను తయారు చేస్తూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిందని చెప్పారు. దేశంపై ఎవరైనా దాడికి దిగితే ఏం జరుగుతుందో భారత్ చేపట్టిన చర్యల ద్వారా మోదీ ప్రపంచానికి చేసి చూపించారన్నారు.
కోట్లాది భారతీయుల దశాబ్దాల స్వప్నమైన అయోధ్య భవ్య రామాలయ నిర్మాణాన్ని మోదీ సాకారం చేశారని, అలాగే కాశీ నగరాన్ని ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా అద్భుతంగా తీర్చిదిద్దారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు.