Penukonda YCP Baba: అనంతపురం ఉమ్మడి జిల్లాలో పెనుగొండ తెలుగుదేశం పార్టీకి అత్యంత పట్టున్న నియోజకవర్గం. అలాంటి చోట వైసీపీ అధికారంలోకి వచ్చిన 2019 ఎన్నికల్లో మొట్టమొదటిసారి బోణీ కొట్టగలిగింది. దాంతో పెనుగొండ ఎమ్మెల్యేకి మంత్రి పదవి కూడా దక్కింది. మరి ఏమైందో ఏమో… వైసీపీ గత ఎన్నికల్లో ప్రయోగం చేసి చేతులు కాల్చుకుంది. ఉన్న ఒక్క బలమైన అభ్యర్థిని మార్చి.. మరో అభ్యర్థిని తెచ్చిపెట్టింది. ఎన్నికల్లో ఓడిపోయి ప్రస్తుతం పెనుకొండ వైసీపీ ఇంచార్జ్‌గా ఉన్న ఆ నేతను కూడా మారుస్తారన్న ప్రచారం జరుగుతోంది. అసలే బలహీనంగా ఉన్నచోట.. జగన్ పార్టీ ఎందుకు ఇన్ని ప్రయోగాలు చేస్తోంది? అసలు ఎన్నికలకు నాలుగేళ్లకు పైగా సమయం ఉన్న తరుణంలో వైసీపీ అధ్యక్షుడి లెక్కలేంటి?
పెనుగొండ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంది. టీడీపీ ఆవిర్భావం నుంచి ఈ నియోజకవర్గంలో టీడీపీ 8 సార్లు విజయం సాధించగా, కాంగ్రెస్ 2 సార్లు, వైసీపీ 2019లో ఒక్కసారి మాత్రమే గెలిచింది. పరిటాల రవీంద్ర మూడు సార్లు, ఆయన హత్యానంతరం ఆయన భార్య సునీత ఒకసారి టీడీపీ తరఫున గెలుపొందారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి శంకరనారాయణ గెలిచి మంత్రి పదవి సాధించారు. అయితే, 2024 ఎన్నికల్లో వైసీపీ అధ్యక్షుడు జగన్ శంకరనారాయణను తప్పించి, కళ్యాణదుర్గం నుంచి వచ్చిన మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్‌కు టికెట్ కేటాయించారు. ఉషాశ్రీ ఘోర పరాజయం చెందారు. ప్రస్తుతం ఆమె పెనుగొండ వైసీపీ ఇన్‌చార్జ్‌గా, జిల్లా అధ్యక్షురాలిగా కొనసాగుతున్నప్పటికీ, పార్టీలో పట్టు సాధించలేకపోతున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
శంకరనారాయణ అనంతపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోవడంతో, ఇప్పుడు తిరిగి పెనుగొండ ఇన్‌చార్జ్ పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. సోమందేపల్లి, గోరంట్ల మండలాల్లో తన వర్గీయులతో రహస్య సమావేశాలు నిర్వహిస్తూ, ఉషాశ్రీకి వ్యతిరేకంగా వైసీపీ అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తున్నారట. దీనికి ప్రతిగా, ఉషాశ్రీ తన పలుకుబడిని ఉపయోగించి శంకరనారాయణ వర్గీయుల్లో కొందరిని పార్టీ నుంచి సస్పెండ్ చేయించారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి. ఈ సంక్షోభంలో కొత్త ట్విస్ట్ ఇస్తూ, సాయి కాళేశ్వరం బాబా సతీమణి శిల్పా వైసీపీ ఇన్‌చార్జ్ పదవి కోసం పావులు కదుపుతున్నారన్న ప్రచారం జోరందుకుంది.
ఇది కూడా చదవండి: Kunduru Jana Reddy: కోమటిరెడ్డి మంత్రి పదవికి ఎర్త్ పెట్టిన జానారెడ్డి!
అసలు ఎవరీ శిల్పా అండ్ సాయి కాళేశ్వరం బాబా దంపతులు అనుకుంటున్నారా? పదేళ్ల క్రితం పెనుగొండలో మంచి క్రేజ్‌తో ఓ వెలుగు వెలిగిన వ్యక్తే ఈ సాయి కాళేశ్వర్. కడప, అనంతపురంతో అనుబంధం, ఆర్థిక బలం, స్థానిక గుర్తింపు కలిగిన సాయికాళేశ్వర్… షిరిడి సాయి గ్లోబల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలతో పేరు సంపాదించారు. రాజకీయాల ద్వారా ఈ సేవలను, తన భర్త ఆశయాలను విస్తరించాలని సాయికాళేశ్వర్ సతీమణి శిల్పా తీసుకున్న నిర్ణయం వైసీపీ అధిష్ఠానం దృష్టిని ఆకర్షిస్తోందట. త్వరలో ఆమె వైసీపీలో చేరి, ఇన్చార్జ్ బాధ్యతలు తీసుకునేలా పావులు కదుపుతున్నారని శిల్ప అనుచరులు చెప్తున్నారు.
శంకరనారాయణను పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా నియమించడంతో ఉషాశ్రీ చరణ్ కొంత ఊపిరి పీల్చుకున్నప్పటికీ, ఇప్పుడు శిల్పా ఎంట్రీ ఆమెను మళ్లీ ఆందోళనకు గురిచేస్తోంది. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో పెనుగొండ టికెట్ దక్కే చాన్స్ లేకుంటే, ఉషాశ్రీ బీజేపీలో చేరి కర్ణాటక నుంచి లోక్‌సభకు పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. శంకరనారాయణ మాత్రం టికెట్ దక్కినా, దక్కకపోయినా వైసీపీలోనే కొనసాగుతానని చెబుతున్నారు.
పెనుగొండ వైసీపీలో నాయకత్వం కోసం శంకరనారాయణ, ఉషాశ్రీ చరణ్, శిల్పా మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఎన్నికలకు ఇంకా నాలుగేళ్లకు పైగా సమయం ఉన్నప్పటికీ, ఈ అంతర్గత విభేదాలు, ప్రయోగాలు పార్టీని బలహీనపరుస్తున్నాయి. జగన్ ఎవరిని ఇన్‌చార్జ్‌గా నియమిస్తారన్నది వైసీపీ క్యాడర్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఏది ఏమైనా… శిల్పకు వైసీపీ ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగిస్తే, స్వాగతిస్తామని పెనుకొండ వైసీపీ శ్రేణులు అంటున్నాయి. అయితే వైసీపీలోకి ఎంట్రీ ఇస్తారన్న ప్రచారాన్ని శిల్ప ఖండిస్తున్నారట. తాను కేవలం సేవా కార్యక్రమాలు మాత్రమే చేస్తానని, రాజకీయాల్లోకి ఇప్పుడే రానని తన అనుచరుల దగ్గర చెప్పినట్లు తెలుస్తోంది. మరి చూడాలి… పెనుగొండ వైసీపీ ఇన్చార్జ్ బాధ్యతల్లో జగన్ ఎవర్ని నియమిస్తారో!